
AAA Cinemas Vizag: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్‌లో తన తొలి AAA సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి విశాఖపట్నం రానున్నట్లు సమాచారం. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ఆగస్టు 9న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను నిర్వాహకులు పకడ్బందీగా చేస్తున్నారు. అల్లు అర్జున్ స్వయంగా ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించనుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేందుకు అధికారులు, నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారని సమాచారం.
ప్రారంభోత్సవానికి కేవలం ఆహ్వానం అందుకున్న అతిథులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అభిమానుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. గతంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈసారి నిర్వాహకులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారట. అల్లు అర్జున్ కార్యక్రమం పూర్తయ్యే వరకు, ఆయన ప్రాంగణం నుంచి వెళ్లిపోయే వరకు మాల్‌ను సాధారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉంచకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. AAA సినిమాస్ ఇప్పటికే తెలంగాణలో సినీ ప్రియుల్లో మంచి గుర్తింపు తెచ్చుకోగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తన కార్యకలాపాలను విస్తరించనుంది. విశాఖపట్నంలో ప్రారంభం కానున్న ఈ మల్టీప్లెక్స్‌లో అత్యాధునిక సౌకర్యాలు, మెరుగైన థియేట్రికల్ అనుభూతిని అందించే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అల్లు అర్జున్ రాకతో విశాఖలో సినీ సందడి నెలకొననుండగా, భద్రతా కారణాల దృష్ట్యా అభిమానులు సంయమనం పాటించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.