Reading Time: < 1 minute
Mahua Moitra Supreme Court Hate Speech Case Police Appearance

Supreme Court: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ద్వేషపూరిత ప్రసంగం(హేట్ స్పీచ్)కేసులో పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. మహువా తరుపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ, ఆమె వర్చువల్‌గా హాజరయ్యే హక్కు కలిగి ఉందని కోర్టుకు తెలిపారు.

ఇదే సమయంలో గతంలో పోలీస్ స్టేషన్ వెళ్లిన సందర్భంలో తనపై కోడిగుడ్లు విసిరారని, మళ్లీ అలాంటి ఘటన జరిగే అవకాశం ఉందని మహువా కోర్టుకు వెల్లడించింది. అయితే, దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ‘‘మీరు ప్రజాప్రతినిధి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గుడ్లు వేస్తారనే భయం ఎందుకు.? మన స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం గుండెలపై తూటాలను ఎదుర్కొన్నారు. ఇలాంటి పిటిషన్లు ఈ కోర్టు ముందుకు రావాల్సిన అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించింది. చివరకు మహువా మొయిత్రా న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

నదియా జిల్లాలో మొయిత్రాపై హేట్ స్పీచ్ కేసు నమోదైంది. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె వాదిస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 1న కలకత్తా హైకోర్టులో జరుగనుంది. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, మొయిత్రా , అభిషేక్ బెనర్జీతో సహా పలువురు తృణమూల్ నాయకులపై గుడ్లతో దాడులు జరిగాయి.