
Faiz Fazal Incredible Story: భారత క్రికెట్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఏమాత్రం కొదవలేదు. అయితే దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించడంతోనే జాతీయ జట్టులో స్థానం ఖాయం అవుతుందని చెప్పలేం. టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో.. దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టమైన పని. భారత జట్టులో ఉండే తీవ్రమైన పోటీ కారణంగా ఎంతో మంది ప్రతిభావంతుల కెరీర్లు ఒక్కటి లేదా రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాయి. ఈ జాబితాలో మాజీ ఓపెనర్ ‘ఫైజ్ ఫజల్’ పేరు ముందువరుసలో ఉంటుంది.
దేశవాళీ క్రికెట్‌లో 9 వేల రన్స్:
దేశవాళీ క్రికెట్‌లో వేలాది పరుగులు చేసిన ఫైజ్ ఫజల్.. టీమిండియా తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే అజేయ హాఫ్ సెంచరీ చేశాడు. అయినప్పటికీ అతడికి మరోసారి భారత జట్టులో అవకాశం రాలేదు. దీంతో కేవలం ఒకే ఒక్క వన్డే మ్యాచ్‌తో అతడి అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోయింది. విదర్భ, రైల్వేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఫజల్ దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. 2015-16 ఫస్ట్‌క్లాస్ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 714 పరుగులు చేసి బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండగా.. సగటు 44.62గా ఉంది. మొత్తంగా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 138 మ్యాచ్‌లు ఆడిన ఫజల్.. 41 సగటుతో 9,184 పరుగులు చేశాడు.
61 బంతుల్లో అజేయంగా 55 పరుగులు:
ఈ అద్భుత ప్రదర్శనతో 2016లో జింబాబ్వే పర్యటనకు భారత జట్టులో ఫైజ్ ఫజల్‌కు చోటు దక్కింది. అప్పటికే ఫజల్ వయసు 30 ఏళ్లు దాటడంతో.. ముప్పై ఏళ్లు దాటిన వయసులో వన్డే అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2016 జూన్ 15న హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫజల్ తన తొలి వన్డే ఆడాడు. 61 బంతుల్లో అజేయంగా 55 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ.. ఆశ్చర్యకరంగా ఫజల్‌కు మళ్లీ భారత జట్టులో ఆడే ఛాన్స్ దక్కలేదు.
2021లో క్రికెట్‌కు వీడ్కోలు:
ఆ సమయంలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్య రహానే, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఓపెనర్ల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో.. ఫైజ్ ఫజల్ భారత జట్టులో స్థానం నిలబెట్టుకోలేకపోయాడు. దేశవాళీ క్రికెట్‌లో ఎంతగా రాణించినా.. అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకునేందుకు మరో అవకాశం అతడికి లభించలేదు. చివరికి 2021 ఫిబ్రవరిలో ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత క్రికెట్‌లో ప్రతిభ ఒక్కటే సరిపోదని.. సరైన సమయంలో అవకాశం, అదృష్టం కూడా ఒక ఆటగాడి అంతర్జాతీయ కెరీర్‌ను నిర్ణయిస్తాయని ఫజల్‌ను చూస్తే అర్ధమయిపోతుంది.