Reading Time: 2 minutes
Udhayanidhi Stalin Controversy Over Trisha Remarks Explained

అన్నీ కలిసొస్తే సీఎం కావాల్సినోడు… కానీ కాలేకపోయాడు.. అంత మాత్రాన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా…? తాత…అయ్య సంపాదించిన పొలిటికల్ క్రెడిబిలిటీని వివాదాస్పద వ్యాఖ్యలతో మంటకలిపేస్తాడా..? నేను మాట్లాడుతున్నది ఉదయ్ నిధి స్టాలిన్ గురించే.! రాజకీయాల్లో విమర్శలు సహజమే.. కానీ వ్యక్తిగత స్థాయికి దిగజారి మహిళలపై నోరు పారేసుకోవడం… ఉదయ్ నిధి స్టాలిన్ వంటి నేతలకు సమంజసమేనా…? త్రిషపై ఆయన చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు ఒక్కసారిగా భగ్గుమంది.. అయితే ఇలాంటి మాటలు మాట్లాడటం ఆయనకు కొత్తేమీ కాదు… సనాతన ధర్మంపై ఆ మధ్య నోరు పారేసుకున్న ఉదయనిధి స్టాలిన్… గతంలోనూ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేశారు.

తంజావూరులో కావేరి నీటి పంపకాల అంశంపై DMK నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన TVK ప్రభుత్వ తీరును, ముఖ్యమంత్రి విజయ్‌ను తీవ్రంగా విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం మానేసి… డీఎంకేపై రాజకీయ కక్షసాధింపులకు విజయ్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో డీఎంకే కార్యకర్తలు నటి త్రిష పేరును నినాదాలుగా చేయడం ప్రారంభించారు. దానికి స్పందించిన ఉదయనిధి… “మన ప్రాంతానికి నీళ్లు రాకపోయినా పర్లేదు… అక్కడ నీళ్లు చేరాలనేది ఆయన ఆలోచన” అని డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సహా పలువురు రాజకీయ నాయకులు దీనిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి నీచమైన మాటలతో మహిళలను కించపరిచారని విమర్శిస్తున్నారు.

ఉదయనిధి స్టాలిన్ మహిళలను ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 2021 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శశికళ కాళ్లను పట్టుకోవడానికి పళనిస్వామి శవంలా పాకారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అన్నాడిఎంకె నాయకులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆయనపై డిఫమేషన్ కేసు కూడా నమోదు చేశారు. మహిళా నాయకులను, రాజకీయ ప్రత్యర్థులను దిగజార్చేలా మాట్లాడటం ఆయన శైలిగా మారిందనే విమర్శలు వచ్చాయి.

టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయనిధి తన వ్యాఖ్యల జోరు తగ్గించలేదు. మీడియా సమావేశంలో… తన ఎక్స్ ఖాతా పోస్ట్ ద్వారా ముఖ్యమంత్రి విజయ్‌ను సూటిగా లక్ష్యంగా చేసుకున్నారు. అసెంబ్లీ గౌరవానికి భంగం కలిగించేలా కుట్టి స్టోరీ చెప్పడం తగదని వ్యాఖ్యానించారు. చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం వెతుకుతున్న భార్య కథ తమిళనాడు అంతటికీ తెలుసంటూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. విజయ్, ఆయన భార్య సంగీత మధ్య ఉన్న వివాదాలను ఈ రకంగా ప్రస్తావించడంపై టీవీకే శ్రేణులు భగ్గుమన్నాయి. మరో సందర్భంలో మాట్లాడిన ఉదయ్ నిధి… త్వరలోనే టీవీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ఐటమ్ పాటలకు డాన్సులు చేస్తారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు శాసనసభ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

తమిళనాడు రాజకీయ చరిత్రలో నాయకుల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. అయితే రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం ఆందోళన కలిగించే విషయం. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన ఇమేజ్‌ను దిగజార్చే అవకాశాలున్నాయి. శశికళ నుంచి నేటి త్రిష కామెంట్స్ వరకు ఆయన వ్యవహార శైలి రాజకీయాల్లో నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిరసనల్లో పొలిటికల్ పాయింట్లు మాట్లాడకుండా వ్యక్తిగత దాడులకు దిగడం సరైన పద్ధతి కాదన్నది అందరూ ముక్త కంఠంతో చెబుతున్న మాట. ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో డీఎంకే పార్టీకి ఎలాంటి రాజకీయ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయో వేచి చూడాలి.