
పేదలకు ఎంతైనా ఖర్చు పెట్టాలని అనుకున్నా కానీ… ఖజానా ఖాళీగా ఉందని అన్నారు సీఎం చంద్రబాబు. శుక్రవారం ( ఆగస్టు 7 ) బాపట్లలో నేతన్న సేవలో పథకం ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో చేనేత కార్మికులు ఇబ్బంది పడ్డారని.. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన ఘనత మన చేనేత కార్మికులదని అన్నారు చంద్రబాబు.
గత 45 ఏళ్లుగా బీసీలు టీడీపీకి వెన్నెముకగా ఉన్నారని.. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని అన్నారు. సూపర్ 6 అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని.. ఈ రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని అన్నారు చంద్రబాబు.అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ఇచ్చామని.. సంజీవని హెల్త్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నామని… అందరికీ రూ. 2 లక్షల 50 వేల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని వెల్లడించారు చంద్రబాబు.
గత ప్రభుత్వం గుంతలు తవ్విన రాష్ట్రాన్ని అప్పజెప్పిందని.. రోడ్లపై గుంతలన్నీ పూడ్చామని.. అభివృద్ధిపైనే ఫోకస్ పెడుతున్నామని అన్నారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం వెనకబడిన వర్గాలకు అండగా ఉందని అన్నారు.