Reading Time: < 1 minute

హైదరాబాద్: పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత మనపై ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. పిప్పిరిలో మొదలు పెట్టి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించారు. పీపుల్స్ మార్చ్ కు మూడేళ్లు పూర్తైన వేళ సభలో భట్టి మాట్లాడారు.. పీపుల్ మార్చ్ లో ఇచ్చిన హామీల అమలుపై జివోలు జారీ చేశామని, ఇవాళే రూ.1,238 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశామని తెలియజేశారు. అధికారంలోకి వచ్చేందుకు నేతలు ఎన్నో హామీలు ఇస్తుంటారని, కొందరు నేతలు అధికారంలోకి రాగానే హామీలు మర్చిపోతారని విమర్శించారు. తాము ఇచ్చిన హామీలను మర్చిపోయే నేతలం కాదని, ప్రజలు అధికారం ఇచ్చింది.. హోదా అనుభవించడానికి కాదని అన్నారు.

ఒకే విడతలో రుణమాఫీ చేసి రూ. 22,500 కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని, ప్రతి నియోజకవర్గంలో పేదల కోసం 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని అన్నారు. తొలివిడతలోనే మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని భట్టి పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని, ఇన్ని పథకాలు, హామీలు ఎలా చేయగలుగుతున్నారని ఇతర రాష్ట్రాల నేతలు అడుగుతున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో పుట్టడం అదృష్టంగా ప్రజలు భావించే పరిస్థితులు ఉండాలని భావించామని, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వర్తించేలా రూ.5 లక్షలతో ఇందిరమ్మ బీమా పథకం తీసుకువచ్చామని అన్నారు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన పేదల కష్టాలు, అవసరాలు తెలుసని, ప్రజల సంక్షేమం తప్ప.. వారికెవరికీ వ్యక్తి ప్రయోజనాలు లేవని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.