
యువత నెమ్మదిగా క్రీడలకు దూరం అవుతున్నారని.. క్రీడా మైదానాలను వదిలిపెట్టి యువత తప్పు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పబ్, డ్రగ్ కల్చర్ లోకి వెళ్తున్న యువతను తిరిగి క్రీడా మైదానాల్లోకి రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఎస్సీ, ఆదివాసీ పిల్లలకు… మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడే అవకాశం కల్పించామన్నారు. భారత ఫుట్ బాల్ చరిత్రలో హైదరాబాద్ నగరానికి విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని.. 1950 నుంచి 60 వరకు నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్ బాల్ గా హైదరాబాద్ ను పిలిచేవారని చెప్పారు. దేశంలోనే ఫుట్ బాల్ ఆటను ఆదరించి అగ్రశేణి క్రీడాకారులను హైదరాబాద్ అందించిందన్నారు.
బీఎన్ మల్లిక్ ఒక స్పై మాస్టర్ అని.. నిఘా వ్యవస్థను తీర్చిదిద్దడంలో బీఎన్ మల్లిక్ ది కీలక పాత్ర అని సిఎం చెప్పారు. టోర్నమెంట్ లో 34 జట్లు అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారన్న సిఎం.. దేశం నలుమూల నుంచి క్రీడాకారులు తరలివచ్చి మంచి ప్రదర్శనను కనపర్చిన వారందరికి అభినందనలు తెలిపారు.
“సౌత్ కొరియాలో స్పోర్స్ యూనివర్సిటీ ని నేను సందర్శించాను. 30 ఎకరాల్లో ఉన్న స్పోర్స్ యూనివర్సిటీ అనేక బంగారు పతకాలు సాధించింది. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఒక్కరు కూడా బంగారు పతకం సాధించలేకపోయాం. 4 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా దేశం 30 కి పైగా పతకాలు సాధించింది. సౌత్ కొరియాలో ఒక్క అమ్మాయి 2 బంగారు పతకాలు సాధిస్తే ఇంత పెద్ద దేశం ఒక్క పతకాన్ని తెచ్చుకోలేకపోయింది. అంతర్జాయతీ స్థాయిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రైవేట్,పబ్లిక్ భాగస్వామ్యంలో ఏర్పాటయ్యే ఈ యూనివర్సిటీలో ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు బోర్డు మెంబర్స్ గా ఉన్నారు. యువతకు మార్గదర్శనం చేయాలనే హైదరాబాద్ కు మెస్సీని తీసుకువచ్చాను. ఎస్సీ, ఆదివాసీ పిల్లలకు మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడే అవకాశం కల్పించాం. బాక్సింగ్ ఛాంపియన్ నిక్కత్ జరీన్ కు గ్రూప్ 1 ఉద్యోగం తో పాటు 2 కోట్ల నగదు పురస్కారం అందించాం. 10వ తరగతి ఫెయిల్ క్రికెటర్ సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడానికి అర్హత లేకపోయినా అన్ని నిబంధనలు సడలించి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. ఫారా ఒలింపిక్స్ లో రాణించిన దీప్తి జురాంజి కి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చాం. క్రీడల్లో రాణించే తెలంగాణ యువతకు ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి.. నాది హామీ” అని సిఎం రేవంత్ పేర్కొన్నారు.