
ప్రతిఏటా సంక్రాంతి సీజన్‌లో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి రద్దీకి చెక్‌పెట్టేలా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త టెక్నాలజీని ప్రయోగించనుంది. వాహనాలు ఆగకుండానే, మూడు సెకన్‌లలో టోల్ వసూలు చేసేలా శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ సిస్టమ్‌ను పరిశీలిస్తోంది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఈ మేరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. విజయవాడ వైపు వెళ్లే 8 బూత్ లలో ఈ ట్రయల్ రన్ నిర్వహించగా వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ను గుర్తించగానే సెన్సార్లు ఫాస్టాగ్‌ను స్కాన్ చేసి ఆటోమెటిక్ గా పేమెంట్ ను కంప్లీట్ చేస్తాయి. అయితే కొన్ని వాహనాలకు టోల్ ఫీజు సరిగ్గా కట్ అవ్వకపోవడం వంటి సమస్యలను గుర్తించిన అధికారులు వాటిని సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. పండుగ రద్దీ మొదలయ్యేలోపు ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ, టోల్ ప్లాజా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇక సంక్రాంతి రద్దీ దృష్ట్యా పంతంగి టోల్ ప్లాజా వద్ద మరో రెండు టోల్ బూత్‌లను తెరవాలని అధికారులు యోచిస్తున్నారు.