Reading Time: < 1 minute

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద సిమెంట్ ట్యాంకర్‌ను డిసిఎం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద సిమెంట్ ట్యాంకర్ మలుపు తిరుగుతుండగా, వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో డిసిఎంలో ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు వీరు కుమార్ (36), సంతోష్‌కుమార్ (32), సూరజ్ (18) మృతి చెందగా,

సుజిత్ కుమార్, కిషోర్, సికిందర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరందరూ బతుకుదెరువుకోసం హైదరాబాద్ ప్రాంతంలో పనిచేసుకుంటున్నారు. ఘటన స్థలాన్ని సందర్శించిన డిఎస్‌పి రాజశేఖర్‌రాజు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లకు అడ్డంగా ఉన్న డిసిఎంను క్రేన్ సహాయంతో తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ 1వ పట్టణ సిఐ నాగభూషణం తెలిపారు. కాగా, జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ గతంలో ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గాగుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.