Reading Time: 3 minutes

అయ్యా / అమ్మా ప్రస్తుతం మన గుంటూరు ప్రాంతంలో మనం జరుపుకుంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు అభినందనీయం, చాలా సంతోషదాయకం. మరుగునపడుతున్న మన మాతృభాష తెలుగు అభివృద్ధి కోసం తెలుగుజాతి సంస్కృతి, సాంప్రదాయాలు నిలబడడం కోసం ఇలాంటి తెలుగు మహాసభలు జరగడం చాలా సంతోషదాయకం. ఇంతటి మంచి సభలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు మొదటగా నా కైమోడ్పులు. అయితే ఇలాంటి మహాసభలు గతంలో ఎన్నో జరిగాయి, ప్రస్తుతం జరుగుతున్నాయి. ఎన్ని సభలు ఏమి జరిగినా, ఏలికలకు గాని, ప్రజలకు గాని, తెలుగు భాషపై మమకారం లేదు. ప్రాథమిక బడులలో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి, ఇంటర్, డిగ్రీలలో తెలుగు బదులుగా సంస్కృతాన్ని ప్రతిపాదిస్తున్న ఈ ప్రభుత్వానికి మీరు ఎలాంటి సందేశాన్ని పంపగలుగుతున్నారు. ఎన్నో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి. పోరడు అద్దంకి వెళ్ళాడు వచ్చాడు అన్నట్టుగా, తెలుగుకి ఎలాంటి ప్రయోజనం ఏర్పడడం లేదు. తెలుగు బడులలో గాని, పలుకుబడులలో గాని, అధికార రాతలలో గాని మన తెలుగు భాషకి ఒరిగిందేమీ లేదు.

తెలుగు మాధ్యమం కోసం ఒకటి నుండి 5వ తరగతి వరకు తప్పనిసరిగా ప్రభుత్వ, ప్రైవేటు బడులలో కాన్వెంటలో తెలుగును మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని పోరాటం చేయడం తప్ప, ఇలాంటి ప్రపంచ మహాసభలు జరిగినా, ఆ సభలలో ఒకరినొకరు పొగడం, ఏవో అమలు జరుపుకోలేని తీర్మానాలు చేయడం, గుడ్డ ముక్కలు, చెక్కముక్కల ప్రవాసం ఆపై ఫోటోల ఆవాసం తప్ప అని. ఎలాంటి ప్రయోజనం లేదని ఎందరో తెలుగు అభిమానుల భావన. అందరం మాతృభాష కోసం ప్రజాఉద్యమంలో పాల్గొనాలి. తమిళులు లాగా, కన్నడిగులాగా, మరాఠీ వారు లాగా మనం కూడా మాతృభాషను అమ్మగా భావించి ఉద్యమాలు చేయిస్తే తప్ప, మన భాషకు, మన సంస్కృతికి మనుగడ ఉండదని నాలాంటి తెలుగు అభిమానుల ఆవేదన. భారత రాజ్యాంగం ఆర్టికల్ 350 ప్రకారం విద్యా బోధన మాతృభాషలో జరగాలని, విద్యా చట్టం 35/2009 సెక్షన్ 29ఎఫ్ ప్రకారం ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలన్న విషయం మన ప్రభుత్వాలకు తెలియనిది కాదు. మరి ఎందుకని తెలుగు భాషపై ఇంత నిర్లక్ష్యం అని చాలామంది తెలుగు అభిమానుల ఆందోళన, ఆవేదన.

ప్రస్తుతం డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలో విద్య నేర్చుకుంటున్న ఇంగ్లీష్ మీడియం విద్యార్థులను పరిశీలించినట్లయితే వారికి ఇటు తెలుగు రాదు, అటు ఇంగ్లీషు రాదు, అక్కడ విద్యార్థులకు ఎక్కువ కళాశాలలో పేరుకు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియంలోనే ఎక్కువగా బోధిస్తున్నారని సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇంగ్లీష్ మీడియం వలన ప్రయోజనం ఏమున్నది. అలాగే మరొక ముఖ్యవిషయం ఇంగ్లీష్ మీడియం చదివినంత మాత్రాన ఉద్యోగాలు వస్తాయని గ్యారెంటీ ఏమైనా ఉన్నదా! కొన్ని లక్షలమంది ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉద్యోగాలు లేక మదనపడుతున్నారు ఈ తరంలో ఉన్న వయసు మళ్ళిన వారంతా గతంలో తెలుగు మీడియం చదివిన వారే. మేమంతా తెలుగు మీడియం చదివి, ఇంగ్లీషులో పట్టు సాధించి ఉన్నత పదవులలో రాణించలేదా. మాతృభాషలో చదివిన వారికి విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది, విషయ అవగాహన ఎక్కువగా ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసినదే కదా. మరి ఎందుకు ఈ విషయాన్ని అటు ప్రభుత్వం ఇటు ప్రజలు పరిశీలించరు అనేదే మా ఆవేదన. గతంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో అప్పుడు పాల్గొన్న ఎందరో మహానుభావులు, రాజకీయ నాయకులు, సాహితీవేత్తలు, కవులు అందరూ మూకుమ్మడిగా ఎన్నో తీర్మానాలు, విన్నపాలు చేసుకున్నారు. వాటిలో ఒక్క శాతమైన మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం నెరవేర్చినదా (ప్రభుత్వ మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు ఆనాటి ఈ మహాసభలలో పాల్గొన్న వారే కదా వారు హామీలు ఇచ్చిన వారే కదా) లేదా వాటి కోసం ఈ మహాసభలు నిర్వాహకులు ప్రభుత్వంపై ఏదైనా ఒత్తిడి తెచ్చారా అన్నది మనం ఆలోచించవలసిన విషయం. అలాగే మరొక ముఖ్యమైన విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో విలువైన, విశిష్టమైన అనేక పురాతన తెలుగు శాసనాలు కనుగొనడం అయినది.

అలాగే ప్రస్తుతం కూడా కొన్ని బయలు పడుతున్నది. అవి ఇప్పటికీ ఎండకి ఎండుతూ వానలో తడుస్తూ, ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా నిరుపయోగంగా ఉన్నాయి. అలాగే అనేక తెలుగు విలువైన కావ్యాలు, గ్రంథాలు రక్షణకు, ప్రచురణకు నోచుకోకుండా తంజావూరు గ్రంథాలయంలో తెలుగు తల్లి ఎదురుచూపులు చూస్తున్నది. అలాగే తెలుగు భాషకు సేవచేసిన అనేకమంది తెలుగు సంస్కరణవేత్తలు, సాహితీవేత్తలు, మహనీయులు వారికి సంబంధించిన నివాసాలను, వారి పేరుట స్మారక మందిరాలుగా, సాంస్కృతిక కేంద్రాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది మన తెలుగు పాలకులకు తెలుగు వారికి తెలుగు సంస్కృతిపై, తెలుగు భాషపై ఎంత మమకారం ఉన్నదో తెలియజేస్తున్నది. అలాగే ప్రతి సంవత్సరం దాదాపు పది కోట్లు తెలుగు అభివృద్ధికి మన బడ్జెట్లో కేటాయిస్తున్నారని సమాచారం. అయితే ఆ పది కోట్లు దేనికోసం ఖర్చు పెడుతున్నారో, ఎవరికీ తెలియదు. ఈ విషయంలో తెలుగు వారందరూ ఒకసారి ఆలోచింతురు గాక. అలాగే మరొక విషయం నేడు మన తెలుగు రాష్ట్రాలలో విడుదలవుతున్న తెలుగు సినిమాలకు అన్ని ఇంగ్లీషు పేర్లు ఉంటున్నాయి.

అసలు తెలుగు పేర్లే ఉండడం లేదు. తెలుగు పేరు పెడితే నామోషీలాగా, హీనంగా భావిస్తున్నారు నిర్మాతలు. అదీకాక వాలు పోస్టర్లు అనగా గోడ పత్రికలలోపై ఆ సినిమా గురించి సమాచారం అంతా ఇంగ్లీషులోనే ఉంటుంది. ఒక్క ముక్క తెలుగు కూడా ఉండడం లేదు. అంటే తెలుగు రాష్ట్రంలో మనం ఉన్నట్లుగా లేదు. ఏదో విదేశాలలో ఉన్నట్లుగా ఉంటున్నాయి ఆ గోడపత్రికలను చూస్తున్నప్పుడు.ఇలా మాట్లాడినందుకు మిమ్ములను నొప్పిస్తే క్షమించగలరు. కనుక అయ్యలారా, అమ్మలారా మన తెలుగుని కాపాడుకోవడం కోసం మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అన్న విషయం మీకు ఇప్పటికే పూర్తి అవగాహన అయి ఉంటుంది అని మా లాంటి తెలుగు అభిమానుల ఆవేదన, ఆందోళన. మీరు మమ్ములను అపార్థం చేసుకోకుండా ఉండగలరని, తెలుగు భాష గురించి నిజానిజాలు తెలుసుకోగలరని, మాలాంటి తెలుగు అభిమానుల ఇలాంటి తెలుగువారి నగ్నసత్యాలను, విన్నపాలను అన్యధా భావించరని మా వేడికోలు.

రాఘవ మాస్టారు కేదారి

63629 73252

(జాతీయ తెలుగు పరిరక్షణ సమితి అధ్యక్షులు)