
న్యూఢిల్లీ: కోలీవుడ్ స్టార్ హీరో, టివికె అధినేత విజయ్‌కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయన్ను ఈ నెల 12న విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. అయితే ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో విజయ్‌ను సిబిఐ విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీన విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సభలో తొక్కిసలాట జరగడంతో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఐజి ఆశా గార్గ్ నేతృత్వంలోని సిట్ తొలుత దర్యాప్తు చేపట్టింది. దీనిని సవాల్ చేస్తూ టివికె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
తమిళనాడు పోలీసులు మాత్రమే ఉన్న సిట్‌పై నమ్మకం లేదని, సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. దీన్ని విచారించిన జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ ఎన్‌వి అంజారియాలతో కూడి ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతలు సిబిఐకి అప్పగిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పాటు దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి అజత్ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.