
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత శాసనమండలిలో కన్నీరు పెట్టుకున్నా రు. శాసనమండలిలో సోమవారం సమక్క – సారలమ్మ జాతరపై జరిగిన చర్చలో ఎంఎల్‌సి కవిత మాట్లాడారు. శాసనమండలిలో ఇదే త న చివరి ప్రసంగమంటూ కవిత కన్నీటి పర్యంతమయ్యారు. బిఆర్‌ఎ స్ పార్టీలో తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా చిత్తశుద్ధితో నిర్వర్తించాన ని, పార్టీలో, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు త నను దారుణంగా అవమానించి బయటకుపంపించారంటూ భావోద్వేగానికి గురయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చుట్టూ ఉన్న కొంతమంది నాయకులు తనను ఎన్నో సందర్భాలలో అవమానించారని చెప్పారు. ఎంఎల్‌సి పదవికి రాజీనామా ఇచ్చినా చైర్మన్ ఆమోదం తెలపకపోవడంతో మండలి వేదికగా తన ఆవేదన వెల్లడించేందుకు సభకు వచ్చానని ఆమె పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్ 3న తన ఎంఎల్‌సి పదవికి రాజీనామాను ఛైర్మన్ ఫార్మాట్‌లోనే పంపినట్లు చెప్పారు. ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఛైర్మన్ సూచించారని అన్నారు. పలు సందర్భాల్లో కూడా రాజీనామా ఆమోదించాలని కోరానని గుర్తు చేశారు.
అయినా తన రాజీనామాపై 4 నెలల సమయంలోనూ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఎంఎల్‌సి పదవి ఇచ్చిన బిఆర్‌ఎస్ పార్టీకి, నిజామాబాద్ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. బిఆర్‌ఎస్ నుంచి తనకు అనేక కట్టుబాట్లు ఎదురయ్యాయని, ఆ పార్టీ నుంచి వచ్చిన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. దయచేసి ఆమోదించాలని కవిత మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కోరారు. రాజీనామాపై పునరాలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. తన రాజీనామాకు కారణాలను సభలో చెప్పేందుకు సమయం ఇచ్చినందుకు చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు. నైతికత కోల్పోయిన బిఆర్‌ఎస్‌లో తాను ఉండలేనని, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎంఎల్‌సి పదవిలోనూ ఉండలేనని చెప్పారు. కెసిఆర్, ప్రొ.జయశంకర్ స్ఫూర్తితో తాను ఉద్యమంలోకి వచ్చానని వ్యాఖ్యానించారు. అప్పటికే టిఆర్‌ఎస్ రాజకీయ పార్టీగా ఎదిగిందని, కెసిఆర్ కేంద్రమంత్రిగా ఉన్నారని చెప్పారు. అయినా తాను సొంతంగా జాగృతి అనే సంస్థ ద్వారా పోరాటం ప్రారంభించానని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమంలో లోటుపాట్లు పూడ్చేందుకు కృషి చేశానని చెప్పారు. యువకులను ఉద్యమంలోకి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
కెసిఆర్‌పై కక్షతో బిజెపి నన్ను జైలులో పెట్టించింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని, బిఆర్‌ఎస్ తనను ఘోరంగా అవమానించిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇడి, సిబిఐతో పోరాడేటప్పుడు పార్టీ తనకు అండగా నిలవలేదని అన్నారు. కెసిఆర్‌పై కక్షతో బిజెపి తనను జైలులో పెట్టించిందని ఆరోపించారు. కెసిఆర్‌పై విమర్శలు వచ్చినా బిఆర్‌ఎస్ నేతలు స్పందించలేదన్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు బిఆర్‌ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని చెప్పారు. మన పండుగ గౌరవం కాపాడాలని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించే కార్యక్రమాలు చేశాను. బతుకమ్మ మన ఆత్మగౌరవ ప్రతీకగా ముందుకు వెళ్లామని, 3 వేల ఏళ్ల తెలంగాణ చరిత్ర సాక్ష్యాలతో పుస్తకాలను వెలువరించామని తెలిపారు. అప్పుడు మీడియాలో, సినిమాల్లో తెలంగాణ యాస, భాషకు జరుగుతున్న అవమానంపై పోరాటం చేశామని గుర్తు చేశారు. అప్పటి పాఠ్యా పుస్తకాల్లో తెలంగాణ మహనీయుల చరిత్ర లేకపోవటాన్ని ప్రశ్నించామని, అప్పటి శ్రీ కృష్ణ కమిటీకి తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై వివరాలు ఇచ్చామని చెప్పారు. శ్రీ కృష్ణ కమిటీ తుది రిపోర్ట్‌లో కూడా తాము చెప్పిన అంశాలు నిజమేనని చెప్పిందని తెలిపారు. తెలంగాణలో ఉన్న సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు రావాలని పోరాటం చేశామని అన్నారు.
నాది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మగౌరవ పంచాయితీ
బిఆర్‌ఎస్ గొడవలు ఆస్తుల పంచాయితీ అని కాంగ్రెస్ విమర్శిస్తోందని కవిత మండిపడ్డారు. తన బిడ్డలపైన, తమ ఇంటి దైవం లక్ష్మీ నరసింహా స్వామి దేవుడిపైన ప్రమాణం చేసి చెబుతున్నా, ఇది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మగౌరవ పంచాయితీ అని వివరించారు. నేను హరీష్ రావు గారి పేరు చెప్పిన రెండు గంటల్లో నన్ను సస్పెండ్ చేశారు. ఉరి తీసేవాళ్లను కూడా చివరి కోరిక ఏంటనీ అడిగే గొప్ప దేశం మనది అని, కానీ తనను మాత్రం అన్యాయంగా పార్టీ నుంచి వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బిఆర్‌ఎస్ పార్టీ కానిస్టిట్యూషన్ కమిటీ 8 పేజీలు ఉంటుందని, అది ఒక పెద్ద జోక్ అని విమర్శించారు. తనను సస్పెండ్ చేసేందుకు రాత్రికి రాత్రే డిసిప్లేనరీ యాక్షన్ కమిటీ పుట్టుకొచ్చిందని, నోటీసులు ఇవ్వకుండా, తన వివరణ అడగకుండా సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను హరీష్ రావు పేరు చెప్పిన రెండు గంటల్లో తనను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఒక పార్టీని నడిపే పద్దతి ఇది కానే కాదు అని పేర్కొన్నారు. తన సస్పెన్షన్‌పై న్యాయపరంగా పోరాటం చేయవచ్చని, కానీ నైతికత లేని బిఆర్‌ఎస్‌పై ఛాలెంజ్ చేయను అని పేర్కొన్నారు. ఆ పార్టీకి దూరమవుతున్నందుకు సంతోషంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు మహిళలపై ఎంతో చిన్నచూపు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల్లో మహిళల ప్రాతనిథ్యం 0.00003 శాతంగా ఉందని చెప్పారు. పదవుల్లో మహిళలకు సరైన అవకాశాలు ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం విషయంలో కెసిఆర్‌పై వచ్చిన ఆరోపణలను బిఆర్‌ఎస్‌లో పెద్ద నాయకులమని చెప్పుకునే వాళ్లు ఎవరూ స్పందించలేదని మండిపడ్డారు. అందుకే తాపు ప్రెస్‌మీట్ పెట్టి బలంగా మాట్లాడానని, అవినీతిపరుల పేర్లు మీడియాకు వెల్లడించానని అన్నారు.ఉద్యమ ద్రోహులకు బిఆర్‌ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపించారు.
అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే ఎలా
బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే తనపై కక్షగట్టారని కవిత భావోద్వేగానికి గురయ్యారు. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే రాష్ట్రంలో ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లు స్వతంత్ర సంస్థను నడిపించానని, పార్టీలో, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినట్లు తెలిపారు. అమరుల స్థూపం మొదలుకుని కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఒక్క వానకే సిద్దిపేట, సిరిసిల్లలో కలెక్టరేట్‌లు కొట్టుకుపోయాయన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వాలని పార్టీలో కోరానని తెలిపారు. అమరవీరులను బిఆర్‌ఎస్ ఎప్పుడూ గుర్తించలేదని, నీళ్లు, నిధులు, నియామకాలను బిఆర్‌ఎస్ పట్టించుకోలేదని ఆరోపించారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని తాను ఎన్నోసార్లు అడిగినట్లు తెలిపారు. దానిని తెరిపించలేకపోవడం తనకు అవమానకరంగా ఉందని వ్యాఖ్యానించారు. కెసిఆర్‌ను అడిగే ధైర్యం తనకే ఉందని, తద్వారా ఎన్నో విషయాలు అడిగానన్నారు. టిఆర్‌ఎస్ నుంచి బిఆర్‌ఎస్‌గా మార్చడాన్ని తాను ఒప్పుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో చేయాల్సి ఉన్నా, వదిలేసి టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి ఢిల్లీకి గురిపెట్టారని అన్నారు. కొన్ని సంస్థలకే రూ.లక్షల కోట్ల టెండర్లు వెళ్లాయని ఆక్షేపించారు.
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత శాసనమండలిలో కన్నీరు పెట్టుకున్నా రు. శాసనమండలిలో సోమవారం సమక్క – సారలమ్మ జాతరపై జరిగిన చర్చలో ఎంఎల్‌సి కవిత మాట్లాడారు. శాసనమండలిలో ఇదే త న చివరి ప్రసంగమంటూ కవిత కన్నీటి పర్యంతమయ్యారు. బిఆర్‌ఎ స్ పార్టీలో తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా చిత్తశుద్ధితో నిర్వర్తించాన ని, పార్టీలో, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు త నను దారుణంగా అవమానించి బయటకుపంపించారంటూ భావోద్వేగానికి గురయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, తరువాయి 9లో
తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతోంది
‘సభ నుంచి వ్యక్తిగా వెళుతున్నా.. రాజకీయ శక్తిగా తిరిగి వస్తా’ అని కవిత శాసనమండలిలో ప్రతిజ్ఞ చేశారు. తన సంస్థ త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరిస్తుందని, అందరూ తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతోందని, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ప్రకటించారు. కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వేదిక రాబోతుందని, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల కోసం తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం పనిచేసే రాజకీయ పార్టీ అవసరం ఉందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల పక్షాన పోటీ చేసే శక్తిగా తాము నిలబడుతామని చెప్పారు. లెప్ట్ పార్టీల సానుభూతిపరులు, మావోయిస్టులు తనకు మద్దతివ్వాలని కోరారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళల కోసం పనిచేయటానికి ఈ రాష్ట్రంలో ఓ పార్టీ రాబోతోందని ప్రకటించారు. ‘ఒక ఆడబిడ్డగా నేను ముందడుగు వేస్తున్నా.. నాకు మద్దతుగా నిలవండి’ అని కోరారు.
కవిత రాజీనామాపై పునరాలోచించాలి : చైర్మన్ గుత్తా
కవిత ఆవేదనను అర్థం చేసుకున్నానని, భావోద్వేగంతో రాజీనామా చేశారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. భావోద్వేగంతో ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేయడం సరికాదని మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు.