Reading Time: 2 minutes

మన తెలంగాణ / అమరావతి : తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఏనాడూ అడ్డు చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వివరించారు. ఎంతోమంది త్యాగాలు చేశారని, ఇది రాజకీయ వేదిక కాదని నీటి విషయంలో, సహకారంలో తెలుగు వారంతా కలిసి ఉండాలన్నారు. సోమవారం గుంటూరు జిల్లాలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అలాగే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. గత ఏడాది సుమారు కృష్ణా, గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అభ్యంతరం చెప్పలేదని అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్, ఏఎమ్మార్ ఎత్తిపోతల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను తాను పూర్తి చేశానని స్పష్టం చేశారు. కృష్ణా డెల్టా మోడరైజేషన్ పేరుతో నీటిని పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశామని వెల్లడించారు.

గోదావరి నదిపై గుత్ప, అలీసాగర్, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టామని వివరించారు. ఆంధ్ర ప్రాంతంలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి వంటి లిఫ్ట్ ప్రాజెక్టులు తీసుకు వచ్చామని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు ఇచ్చామని అన్నారు. విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ప్రత్యేక నిధులు ఇచ్చిందని అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నా రు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకే సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్‌ఎల్బీసీ, ఎస్‌ఎర్బీసీ ప్రాజెక్టులు తెచ్చారని ప్రస్తావించారు. తెలుగు వారు కలిసి ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని చంద్రబాబు అన్నారు. గోదావరిపైనా ఉమ్మడి ఏపీలో అనేక ప్రాజెక్టులు కట్టామని, గతేడాది కృష్ణా, గోదావరి నుంచి 6 వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయన్నారు. గోదావరి నీళ్లు వాడుకుంటే తాను ఎప్పుడూ అడ్డు చెప్పలేదన్నారు. విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా గోదావరిలో చాలా నీళ్లున్నాయని అభ్యంతరం చెప్పలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఫర్వాలేదని, రాష్ట్రానికి నీళ్లు వస్తాయని అనుకున్నానని సీఎం తెలిపారు.

గడచిన 40 ఏళ్లుగా 3 వేల టీఎంసీలు గోదావరి నుంచి సముద్రంలోకి పోతున్నాయన్నారు. త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని, కృష్ణా- గోదావరి నదుల అనుసంధానం జరుగుతుందని వెల్లడించారు. ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం మన భారతదేశమే అన్నారు. గంగా, కావేరి కలవాలని తాను ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నానని, దేశంలో నీటి సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. ఏపీలో ఉండే నదులన్నీ అనుసంధానం కావాలని, తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలని, తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదని, సమైఖ్యత అవసరమని- చంద్రబాబు చెప్పారు.