
పలక్కాడ్ (కేరళ): మలయాళ సినిమారంగంలో విలక్షణ నటుడిగా, సమర్ధుడైన ప్రొడక్షన్ కంట్రోలర్‌గా గుర్తింపు పొందిన కన్నన్ పట్టాంబి (61) ఆదివారం రాత్రి 11.41 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కోజికోడ్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రఖ్యాత దర్శకుడు మేజర్ రవికి సోదరుడు కన్నన్. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నిజంగట్టిరిలో స్వంత నివాస ప్రాంతం లోనే జరిగాయి. కేవలం నటుడిగానే కాకుండా సినిమాను నిర్వహించే ప్రొడక్షన్ కంట్రోలర్‌గా పేరు సంపాదించారు. రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో వచ్చిన మిషన్ 90 డేస్ చిత్ర నిర్మాణంలో కన్నన్ కీలక పాత్ర పోషించారు. సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఆయన పనిచేశారు. మళయాళంలో మొట్టమొదటి రూ.100 కోట్ల సినిమాగా రికార్డు సృష్టించిన “ పులి మురుగన్ ” చిత్రానికి కన్నన్ పట్టాంబి అందించిన సహకారం బాగా పేరు తెచ్చిపెట్టింది. మంత్రి ఎంబి రాజేష్, అభిమానులు ఆయన ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు.