Reading Time: < 1 minute

నల్లగొండ జిల్లా కేంద్రంలోని బిసి హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్న ఎర్రబోయిన హిమశ్రీ (19) అనే విద్యార్థిని సోమవారం యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనుముల మండలం, హజారి గూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ దంపతుల పెద్ద కుమార్తె హిమశ్రీ నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న బిసి హాస్టల్‌లో ఉంటూ ఎన్జీ కళాశాలలో బిఎస్‌సి రెండో సంవత్సరం చదువుతోంది. సోమవారం తెల్లవారుజామున హాస్టల్ ఆవరణలో ఉన్న బాత్రూంలు కడిగే యాసిడ్‌ను సేవించి రూమ్ లోకి వచ్చి వాంతులు చేసుకుంది. విషయాన్ని గమనించిన తోటి విద్యార్థినులు ఈ విషయాన్ని వెంటనే వార్డెన్ జ్యోతి దృష్టికి తీసుకెళ్లగా,

చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అనంతరం ఆమెను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే డిబిసిడబ్ల్యుఓ సంజీవయ్యతోపాటు పలువురు అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని, నాలుగు రోజుల తర్వాత కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, యువతి ఆత్మహత్యాయత్నానికి కారకులైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు, బిసి సంఘాల నాయకులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.