
ఫ్రెండ్ మోడీకి కిటుకు తెలుసు
రష్యా చమురు ఆపకపోతే బాగుండదు
మంచి వాడికి ఎక్కువ చెప్పలేను: ట్రంప్
న్యూయార్క్: భారత్ రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయకపోతే అమెరికా మరిన్ని టారీఫ్‌లు విధిస్తుందని అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. భారత్ రష్యా చమురుపై ఆధారపడటం నాకు ఇష్టం లేదనే విషయం మంచివాడైన మోడీకి తెలుసు. బాగా ఆలోచించే వ్యక్తికి ఎక్కువగా చెప్పాల్సిన పనిలేదని ట్రంప్ చెప్పారు రష్యా చమురు విషయంలో నేను సంతోషంగా లేనని మోడీ గ్రహించారు. నన్ను సంతోషపెట్టడం కీలకం. ఇందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవల్సి ఉంటుందని ట్రంప్ చెప్పారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ డిసికి ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ ఒన్ విమానంలో వెళ్లుతున్న దశలో ఆయన తమ వెంట ఉన్న మీడియా వారితో మాట్లాడారు. తనకు కావల్సింది భారత్ నాకు అనుకూలంగా వ్యవహరించడం, ఇది చాలా ముఖ్యం. వేరే డౌట్ లేదు. ట్రంప్ సంతోషంతోనే ఏదైనా జరుగుతుందని మోడీ తెలుసుకున్నారు.
ఇప్పటికైనా రష్యా చమురు నిలిపివేయకపోతే , ఈ వ్యాపారం ఆపివేయకపోతే తాను మరో ఆలోచన లేకుండా వెంటనే భారత్ తెప్పించుకునే రష్యా చమురుపై మరింత సుంకం విధించడం జరుగుతుందని తేల్చిచెప్పారు. ఇది భారత్‌కు చాలా ఇబ్బందికరం అవుతుందని హెచ్చరించారు. వెనెజువెలాలో సైనిక ఆపరేషన్‌ను ఫ్లోరిడాలోని తన సొంత ఎస్టేట్ నుంచి అనుక్షణం పర్యవేక్షించి తిరిగి రాజధానికి వెళ్లుతూ పలు విషయాలపై ట్రంప్ స్పందించారు. మంచి వాళ్లకు వేరే చెప్పాల్సిన పనిలేదని, ఇప్పటికే మోడీకి తన గురించి అంతా తెలిసే ఉంటుందని వ్యాఖ్యానించారు. మంచి వాళ్లకు మంచి జరుగుతుంది. ఆయన మంచివాడుగా నిర్ణయాలు తీసుకుంటాడో లేక రష్యా చమురు కోసం పాకులాడుతాడో ఆయన ఇష్టం అని వ్యాఖ్యానించారు.
ట్రంప్ మాట్లాడటానికి ముందు సెనెటర్ లిండ్సే గ్రహం ఈ విషయంపై స్పందించారు. భారీ సుంకాలు విధించడం వల్లనే ఇప్పుడు భారత్ రష్యా నుంచి చమురు దిగుమతిని భారీ స్థాయిలో నిలిపివేసిందని, ట్రంప్ హెచ్చరికలు బాగా పనిచేశాయని తెలిపారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నిలిపివేతకు రష్యా చమురు వినియోగదారులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే ప్రెసిడెంట్ ట్రంప్ వ్యూహాత్మక నిర్ణయం అని తేల్చిచెప్పారు. దారి వీడకపోతే భారత్‌పై 50 శాతం సుంకాలకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు.
పుతిన్ బసపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి జరగలేదు
గతవారం రష్యా అధ్యక్షులు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరుగలేదు. ఈ విషయాన్ని తమ అధికారులు తనకు నిర్థారించి చెప్పారని ట్రంప్ వెల్లడించారు. దాడి జరిగిందని తాను మొదట భావించానని, దీనిపై ఆందోళన చెందానని అయితే అటువంటిదేమీ లేదని తనకు తెలిసిందని ట్రంప్ మీడియాకు చెప్పారు. పుతిన్ నివాసానికి దగ్గర ఏదో జరిగింది. ఉక్రెయిన్ సేనలు పుతిన్ అధికారిక నివాసాన్ని టార్గెట్ చేసుకోలేదని తెలిసిందని ట్రంప్ వివరించారు. దాడి జరగలేదని తెలిసినందున ఇక పర్యవసనాల సంగతి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. దాడి జరిగిందనే రష్యా వాదనను ఇప్పుడు ట్రంప్ దాదాపుగా తోసిపుచ్చారు.