
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం హరీష్ రావును ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలను విన్న సర్వోన్నత న్యాయస్థానం, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున, మాజీ మంత్రి హరీశ్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించగా, అందుకు ధర్మాసనం నిరాకరించింది.
ఇది కేసు నేపథ్యం
సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ తన ఫోన్‌ను మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు పోలీస్ అధికారి రాధాకిషన్ రావు ట్యాప్ చేశారని ఆరోపిస్తూ 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 2024 డిసెంబర్ 1వ తేదీన పోలీసులు ఎఫ్‌ఎఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత హరీష్ రావు పిఏ వంశీకృష్ణ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తనపై అక్రమ కేసు పెట్టారని, తనపై నమోదు అయిన ఎఫ్‌ఆర్‌ను కొట్టేయాలని కోరుతూ హరీష్ రావు 2024 డిసెంబర్ 4న రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. హరీష్ రావుపై కేసు పెట్టడానికి సరైన ఆధారాలు, బలమైన సాక్షాలు లేవన్న వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తూ ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ చక్రధర్ గౌడ్ సుప్రీంకోర్టుకు వెళ్లగా జస్టిస్ బేలా ఎం.త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై హరీష్ రావును ప్రతివాదిగా చేరుస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా తాజాగా సుప్రీం కోర్టు సైతం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.