Reading Time: < 1 minute

దివ్యాంగులపై జోకులు కేసు: సమయ్ రైనా సహా కమెడియన్లపై కేసులన్నీ కొట్టేసిన సుప్రీంకోర్టు!

Caption of Image.

పాపులర్ యూట్యూబ్ షో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ (India’s Got Latent) లో దివ్యాంగుల మనోభావాలు దెబ్బతినేలా జోకులు వేశారంటూ  సమయ్ రైనా, మరో నలుగురు కమెడియన్లపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాంత్, జస్టిస్‌లు జయమల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

అసలు ఏం జరిగిందంటే?
షోలో దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడారంటూ సమయ్ రైనాతో పాటు విపుల్ గోయల్, బల్‌రాజ్ పరమజీత్ సింగ్ ఘాయ్, సోనాలి ఠక్కర్, నిశాంత్ జగదీష్ తన్వార్‌లపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

అయితే, కోర్టు సూచన మేరకు ఈ కమెడియన్లంతా దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, వారి కోసం నిధులు సేకరించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను వీరు సక్రమంగా పాటించడాన్ని సుప్రీంకోర్టు గుర్తించి, వారిపై ఉన్న క్రిమినల్ కేసులను ఎత్తివేసింది.

కమెడియన్ల ప్రయత్నాలను మెచ్చిన సుప్రీంకోర్టు
ఈ సందర్భంగా కమెడియన్లు చేసిన మంచి పనిని సుప్రీంకోర్టు ధర్మాసనం అభినందించింది. “నిజమైన ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వీరంతా చాలా తెలివైన యువకులు. ఇలాగే సానుకూల మార్గంలో పనిచేస్తే సమాజానికి మంచి జరుగుతుంది” అని ప్రశంసించింది.

దీంతో సమయ్ రైనా సహా ఆ ఐదుగురు కమెడియన్లపై ఉన్న అన్ని క్రిమినల్ కేసులు, విచారణలు ముగిసినట్లు కోర్టు స్పష్టం చేసింది.

విచారణ మాత్రం ముగియలేదు.. ఇంకా ఏముంది?
కమెడియన్లపై ఉన్న కేసులు కొట్టేసినప్పటికీ, ఇలాంటి అభ్యంతరకర కంటెంట్‌ను అరికట్టడానికి ఎలాంటి నిబంధనలు ఉండాలి? కంటెంట్ సెన్సార్‌షిప్ లేదా చెకింగ్‌పై దివ్యాంగుల సంఘాలు, నిపుణుల నుంచి సలహాలు తీసుకోవాలని కోర్టు భావించింది. ఈ అంశంపై మరింత విస్తృతమైన మార్గదర్శకాలు జారీ చేయడానికి తదుపరి విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది.
 

©️ VIL Media Pvt Ltd.