
సైబర్ మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున. తాను కూడా సైబర్ ఫ్రాడ్ బాధితుడినేనని చెప్పారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిర్వహించిన ‘సురక్ష కా తిరంగా’ కార్యక్రమంలో నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
తనకు నాలుగైదేళ్ల క్రితం బ్యాంక్ అధికారి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడని నాగార్జున వెల్లడించారు. తాము సూచించే స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించేందుకు ప్రయత్నించాడన్నారు. మీరు బిజినెస్‌లో చాలా స్మార్ట్ అని విన్నాను.. అలాంటప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు చేయకూడదు? అంటూ మాటలతో వల వేసినట్లు తెలిపారు.
ఇంతటితో ఆగకుండా, తన కుటుంబంలోని కొందరిని సైతం సైబర్ నేరగాళ్లు ఆరు నుంచి ఏడు గంటలపాటు ‘డిజిటల్ అరెస్ట్’ చేశారని నాగార్జున చెప్పడం కలకలం రేపింది. విదేశాలకు నార్కోటిక్ సబ్‌స్టాన్సెస్ పార్సిల్ పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ కూడా వచ్చాయని చెప్పారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. 1977లో తాము ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే కంప్యూటర్లు కొత్తగా వచ్చాయని, అప్పటినుంచే మాల్వేర్, హ్యాకింగ్‌పై ప్రొఫెసర్లు హెచ్చరించేవారని గుర్తుచేశారు. టెక్నాలజీ మారినా సైబర్ నేరాల ముప్పు మాత్రం కొనసాగుతూనే ఉందన్నారు.
►ALSO READ | TOXIC: ‘A’ సర్టిఫికెట్‌తో వస్తున్న యష్.. సెన్సార్‌తో ‘టాక్సిక్’ అసలు స్టోరీ వైరల్
నేను మొబైల్ పాస్‌వర్డ్‌ను వారానికోసారి, వైఫై పాస్‌వర్డ్‌ను నెలకోసారి మారుస్తానని నాగార్జున తెలిపారు. ఫోన్‌లో ఫొటోలు కూడా పెట్టుకోనని చెప్పారు. సైబర్ నేరాలను అడ్డుకోవడం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని పిలుపునిచ్చారు. సినీ ఇండస్ట్రీలో పైరసీ అరికట్టడం కోసం పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.