Reading Time: 3 minutes
Pew Survey 2026 How World Views India

Pew Research Centre Survey: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల శుభవేళ ప్రపంచదేశాల కళ్లల్లో భారత్ ప్రతిరూపం ఎలా ఉంది? మన దేశం పట్ల అంతర్జాతీయ సమాజం ఏమనుకుంటోంది? అనే అంశంపై పియూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Centre) 36 దేశాల్లో నిర్వహించిన ఒక విస్తృతమైన సర్వే అత్యంత ఆసక్తికరమైన, పరస్పర విరుద్ధమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. ప్రపంచంలో భారత్‌ను అత్యధికంగా ప్రేమిస్తున్న దేశంగా మన పొరుగున ఉన్న శ్రీలంక అగ్రస్థానంలో నిలవగా, ఊహించినట్లే జాబితాలో అత్యంత దిగువన పశ్చిమ పొరుగు దేశమైన పాకిస్థాన్ నిలిచింది. ఇక ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాలో మాత్రం భారత్ పట్ల ప్రజల అభిప్రాయం సరిగ్గా రెండుగా చీలిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే మధ్య కాలంలో 42,000 మందికి పైగా ప్రజలతో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా భారత్‌పై సానుకూల దృక్పథమే ఎక్కువగా ఉందని తేలింది. సర్వేలో పాల్గొన్న దేశాల్లో సగటున 45 శాతం మంది భారత్‌ను ఇష్టపడుతుండగా, 41 శాతం మంది ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

శ్రీలంక టాప్..

ఈ అంతర్జాతీయ నివేదికలో అందరి దృష్టినీ ఆకర్షించింది శ్రీలంక. లంకలో ఏకంగా 79 శాతం మంది భారత్‌పై అత్యంత సానుకూల భావాన్ని వ్యక్తం చేయగా, 63 శాతం మంది మన దేశాన్ని తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా గుర్తించారు. కేవలం 11 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు. 2024లో లంకలో భారత్‌కు ఉన్న 65 శాతం ఆదరణతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. 2022లో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు భారత్ అందించిన 7.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం, క్రెడిట్ లైన్లు ఆ దేశ ప్రజల మనసులను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాయని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. లంకతో పాటు ఆఫ్రికా ఖండంలోని కెన్యా (71%), ఐరోపాలో బ్రిటన్ (71%), జర్మనీ (63%), ఇటలీ (56%), స్వీడన్ (55%), మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ (60%) దేశాల్లో కూడా భారత్‌కు బలమైన ఆదరణ లభించింది.

దక్షిణాసియా సరిహద్దుల్లో మిశ్రమం..

అయితే దక్షిణాసియా సరిహద్దుల్లో మాత్రం ఈ చిత్రం కాస్త మిశ్రమంగా కనిపిస్తోంది. ఇటీవల రాజకీయ అల్లకల్లోలాలు ఎదుర్కొన్న బంగ్లాదేశ్‌లో 42 శాతం మంది భారత్‌ను అనుకూలంగా చూస్తుంటే, 51 శాతం మంది ప్రతికూల కోణంలో చూస్తున్నారు. 2024లో తీవ్ర విద్యార్థి ఉద్యమం వల్ల పదవి కోల్పోయిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం ఇక్కడి సంబంధాలపై ప్రభావం చూపింది. అలాగే 2024లో ‘ఇండియా అవుట్’ ప్రచారాన్ని చూసిన మలేషియాలో 58 శాతం మంది ప్రతికూల అభిప్రాయంతో ఉన్నారు. మిగతా ఆసియా దేశాల్లో మాత్రం భారత్‌కు మంచి మార్కులే పడ్డాయి. జపాన్‌లో 55 శాతం, సింగపూర్‌లో 51 శాతం, ఇండోనేషియాలో 50 శాతం, థాయిలాండ్‌లో 55 శాతం, ఫిలిప్పీన్స్‌లో 49 శాతం మంది భారత్ పట్ల సానుకూలంగా ఉన్నారు.

పాకిస్థాన్‌లో 91 శాతం ప్రతికూలత..

మరోవైపు పాకిస్థాన్ విషయంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. ఆ దేశంలో ఏకంగా 91 శాతం మంది భారత్‌పై తీవ్ర ప్రతికూలతను ప్రదర్శించారు. సైనిక-పౌర పాలనల మధ్య స్వేచ్ఛాయుత గళాలను నొక్కేసే పాక్‌లో కూడా విచిత్రంగా 7 శాతం మంది భారత్‌ను సమర్థించడం గమనార్హం. గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా పాక్ లోని ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాలపై విరుచుకుపడటం, ఆ తర్వాత ఇండస్ వాటర్స్ ట్రీటీని భారత్ నిలిపివేయడంతో రెండు అణుదేశాల మధ్య సంబంధాలు తారాస్థాయికి చేరడమే ఈ వ్యతిరేకతకు కారణం. పాకిస్థాన్ తర్వాత టర్కీ (15% సానుకూలత), పాలస్తీనా ప్రాంతాలైన వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేం (18%) లలో భారత్‌కు అత్యంత తక్కువ రేటింగ్ వచ్చింది. ఇటీవల వలస వ్యతిరేక నిరసనలు చూసిన ఆస్ట్రేలియాలో 55 శాతం మంది భారత్ పట్ల ప్రతికూలంగా ఉన్నారు.

అమెరికన్ల అభిప్రాయం ఇదే..

ఇక ప్రపంచ వేదికపై అత్యంత కీలకమైన అమెరికా విషయానికొస్తే, అక్కడ భారత్‌పై ప్రజల అభిప్రాయం తీవ్రంగా విడిపోయింది. 50 శాతం మంది అమెరికన్లు భారత్‌పై వ్యతిరేక భావనతో ఉండగా, 45 శాతం మంది సానుకూలంగా ఉన్నారు. 2008 తర్వాత భారత్‌కు అమెరికాలో లభించిన అత్యంత తక్కువ రేటింగ్ ఇదే కావడం గమనార్హం. 2023లో 51 శాతంగా ఉన్న సానుకూలత 2026 నాటికి 45 శాతానికి పడిపోయింది. ఇక్కడ రాజకీయ పక్షాల వారీగా కూడా పెద్ద వ్యత్యాసమే కనిపిస్తోంది. డెమొక్రాట్లలో 50 శాతం మంది భారత్‌ను ఇష్టపడుతుంటే, డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్లలో ఇది 42 శాతానికి పడిపోయింది. అంతర్జాతీయంగా భారత్ ప్రభావంపై పియూ అడిగిన ప్రశ్నకు 30 శాతం మంది భారత్ శక్తిమంతంగా మారుతోందని చెప్పగా, 54 శాతం మంది భారత్ ప్రభావంలో పెద్దగా మార్పు లేదని, 13 శాతం మంది తగ్గుతోందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ హయాంలో సుంకాలాట, వాణిజ్య ఒప్పందాల ఆలస్యం, పాకిస్తాన్‌తో ట్రంప్ సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించడం వంటివి అమెరికాలో భారత్ ప్రతి ప్రతిబింబాన్ని కాస్త దెబ్బతీశాయి. మొత్తం మీద చూస్తే, ఆసియా, ఆఫ్రికాలోని పలు దేశాల్లో భారత్‌కు తిరుగులేని జనాదరణ కొనసాగుతుండగా, ఐరోపా, లాటిన్ అమెరికాల్లో మిశ్రమ వాతావరణం, అమెరికాలో చీలిపోయిన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Sr 25.08.13 India 1