Reading Time: < 1 minute

బెదిరించి, తప్పుడు కేసులు పెట్టి..నా వైన్ షాపును లాక్కున్నరు..ఇల్లెందులో బాధితుడి ఆరోపణ

Caption of Image.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన మద్యం వ్యాపారి కొండపల్లి గణేష్‌ను అధికార బలంతో, రౌడీషీటర్ల సహకారంతో బెదిరించి వైన్ షాపును కబ్జా చేశారంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆయన చేసిన ఫిర్యాదు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

2025-27 ఎక్సైజ్ టెండర్లలో లాటరీ ద్వారా ఇల్లెందులో వైన్ షాపు దక్కించుకున్న కొండపల్లి గణేష్, MRP ధరలకే విక్రయాలు జరుపుతున్నారు. అయితే, స్థానిక రౌడీషీటర్ మిరియాల చిట్టిబాబు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కుటుంబ సభ్యులు , పలువురు పోలీసు అధికారుల సహకారంతో తన షాపును బలవంతంగా కబ్జా చేశారని గణేష్ ఆరోపించారు.

ఒత్తిళ్లకు తలగ్గకపోవడంతో తనపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారని, ఎమ్మెల్యే సమక్షంలోనే తనను బెదిరించి బలవంతంగా షాపును లాక్కున్నారని బాధితుడు వాపోయారు. రూ.30 కోట్లకు ఐపీ పెట్టే పరిస్థితికి తనను తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

షాపును కబ్జా చేసిన సిండికేట్.. MRP కంటే అదనంగా ప్రతి క్వార్టర్ సీసాపై రూ. 25 వసూలు చేస్తూ, అందులో డిప్యూటీ కమిషనర్‌కు రూ. 15, సిండికేట్‌కు రూ. 10 చొప్పున పంచుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, క్వార్టర్ సీసాల్లో నీళ్లు కలిపి అమాయక ఆదివాసీ గూడేల్లో కల్తీ మద్యం విక్రయిస్తూ ఆదివాసుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు.

తన వద్ద ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో సాక్ష్యాలు ఉన్నాయని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం,సీబీ (ACB) అధికారులు స్పందించి, డిప్యూటీ కమిషనర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని, తనకు ప్రాణరక్షణ కల్పించి బలవంతంగా లాక్కున్న షాపును తిరిగి అప్పగించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

©️ VIL Media Pvt Ltd.