Reading Time: < 1 minute
Iran President Masoud Pezeshkian To Visit Delhi For Brics Summit In September

BRICS Summit: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సెప్టెంబర్ నెలలో భారత్‌లో జరగబోతున్న ‘‘బ్రిక్స్ సమ్మిట్’’కు హాజరుకానున్నారు. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 2026లో బ్రిక్స్‌కు భారత్ అధ్యక్షత వహిస్తోంది. అమెరికా-ఇరాన్ యుద్ధ నేపథ్యంలో పెజెష్కియాన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమ్మిట్‌తో భారత్-ఇరాన్ సంబంధాలు మరింత బలపడనున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం తగ్గించే ప్రయత్నాల్లో భారత్ కీలక పాత్ర పోషించడాన్ని ఇరాన్ స్వాగతిస్తోంది. 2024 అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో పెజెష్కియాన్, ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఆ సమయంలో రెండు దేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించుకున్నారు. ఇరాన్ ఇదే సమావేశంలో బ్రిక్స్‌లో పూర్తి సభ్యదేశంగా చేరింది. ఇదే సమయంలో ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా బ్రిక్స్‌లో చేరాయి. 2025లో ఇండోనేషియా సభ్యత్వం పొందడంతో బ్రిక్స్ పూర్తి సభ్యదేశాల సంఖ్య 11కి చేరింది.

జూన్ నెలలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు భారత్ వచ్చారు. ఆ సమయంలో అరాఘ్చీ భారత్‌కు పెరుగుతున్న అంతర్జాతీయ ప్రభావాన్ని ప్రస్తావించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల్ని తగ్గించడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని అన్నారు. ప్రస్తుత సంక్షోభానికి సైనిక పరిష్కారం లేదని, చర్చలే కీలకమని ఆయన అన్నారు. భారత మధ్యవర్తిత్వానికి ఇరాన్ సానుకూలంగా ఉన్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు. భారత్ నిర్మాణాత్మకంగా వ్యవహరించే ఏ పాత్రనైనా తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.