
న్యూఢిల్లీ: దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన వేళ చారిత్రాత్మక ఎర్రకోట, ఢిల్లీ హైకోర్టు, ఢిల్లీ ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. శుక్రవారం (ఆగస్ట్ 14) గుర్తు తెలియని దుండగులు అధికారులకు ఈ మెయిల్ పంపారు. ఆగస్ట్ 15న ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టులు, ఎర్రకోట, ఎయిర్ పోర్టు, జాతీయ రాజధానిలోని రైళ్లను లక్ష్యంగా చేసుకుని భారీ పేలుళ్లకు పాల్పడతామని హెచ్చరించారు.
సిక్కులకు సంబంధించిన కేసులలో ఢిల్లీ హైకోర్టు న్యాయం అందించడంలో విఫలమైందని దుండగులు పేర్కొన్నారు. అలాగే, ఢిల్లీని ఖలిస్తాన్‌లో భాగంగా చేస్తామని మెయిల్లో పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధానిలో భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేసిన పోలీసులు.. బాంబ్ బెదిరింపుల నేపథ్యంలో సెక్యూరిటీని మరింత టైట్ చేశారు.
►ALSO READ | రాహుల్ గాంధీపై కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు: ఆయన అన్నదాంట్లో తప్పులేదని వ్యాఖ్యలు
ఎర్రకోట, ఢిల్లీ హైకోర్టు, ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్లలో భద్రతను భారీగా పెంచారు. రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్ని్స్తున్నారు. మరోవైపు బాంబ్ బెదిరింపు మెయిల్ లపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.