Reading Time: < 1 minute

కేంద్ర పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందాలి : ఎంపీ డీకే అరుణ

Caption of Image.

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, జిల్లా అభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ ఎంపీ డీకే అరుణ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఆమె అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తాలతో కలిసి వివిధ శాఖల పనితీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎంపీ అరుణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన నిధులు దుర్వినియోగం కాకుండా అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పథకాల అమలులో లోపాలు ఉంటే సవరించుకొని లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గండీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ దిశ సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పనుల ప్రారంభంలో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మమత, అదనపు కలెక్టర్ హరిప్రియ, వివిధ శాఖల అధికారులు 
పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.