Reading Time: 2 minutes

రాజస్థాన్ రాయల్స్ ‘రాయల్’ విక్టరీ: పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్

Caption of Image.

PBKS vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని పంజాబ్ కింగ్స్ (PBKS) జైత్రయాత్రకి రాజస్థాన్ రాయల్స్ (RR) బ్రేక్ వేసింది.  న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, పంజాబ్ వరుస విజయాలకు అడ్డుకట్ట వేసింది. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ బ్యాటర్లు ఊహించని రీతిలో ఛేజ్ చేసి ఔరా అనిపించారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ మళ్లీ ఫామ్‌లోకి రాగా, పంజాబ్ కింగ్స్ తమ తప్పులను సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

వైభవ్ మెరుపులు.. జైస్వాల్ విధ్వంసం!
223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్ కు 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే స్టార్ట్ అందించాడు. కేవలం 16 బంతుల్లోనే 5 సిక్సర్లతో 43 పరుగులు చేసి స్టేడియంలో పూనకాలు తెప్పించాడు. ఆ తర్వాత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (26 బంతుల్లో 51) తన మార్క్ బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ బాది పంజాబ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు.

చాహల్ ‘మ్యాజిక్’:
ఒక దశలో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన స్పిన్ మంత్రంతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. జైస్వాల్ (51), ధృవ్ జురెల్(16), కెప్టెన్ రియాన్ పరాగ్‌(29)లను వరుసగా అవుట్ చేసి పంజాబ్ క్యాంప్‌లో ఆశలు చిగురింపజేశాడు. ముఖ్యంగా పరాగ్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్ పంపి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు.

ఫెరీరా– దూబే ఫినిషింగ్ టచ్: 
మ్యాచ్ చేజారిపోతుందనుకున్న తరుణంలో డోనోవన్ ఫెరీరా, మశుభమ్ దూబే అసాధారణ పోరాటాన్ని కనబరిచారు. ఫెరీరా కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసి, ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు తొలి ఓటమిని రుచి చూపించారు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ ఒక్కడే 3 వికెట్లు తీసుకోవడంతో పాటు తక్కువ పరుగులు సమర్పించుకున్నాడు, ఇక అర్షదీప్ సింగ్ మాత్రం తాను వేసిన 4 ఓవర్లలో ఏకంగా 68 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. లకీ ఫెర్గుసన్, మార్కో యాన్సెన్ ధారళంగా రన్స్ ఇవ్వడంతో పాటు వికెట్లు తీయడంలో ఫెయిల్ కావడంతో పంజాబ్ ఘోర ఓటమిని చవిచూసింది.  

©️ VIL Media Pvt Ltd.