Reading Time: 2 minutes

గుజరాత్ స్థానిక ఎన్నికల్లో సత్తాచాటిన సెలబ్రెటీలు.. చిత్తుగా ఓడిన సీనియర్ నేతలు

Caption of Image.

గాంధీనగర్: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రజా తీర్పును అంచనా వేయడం కష్టం. కచ్చితంగా గెలుస్తారనుకునే అభ్యర్థులు ఓటమి పాలైతే.. కనీసం ముక్కు ముఖం తెలియని వారు కూడా కొన్నిసార్లు విజయం సాధిస్తుంటారు. ఇందుకు 2026 గుజరాత్ స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. 2026 గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. పేరుమోసిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.. ఫస్ట్ టైమ్ ఎన్నికల బరిలోకి దిగిన కొందరు ఘన విజయం సాధించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లు, గాయకులు, నటులు పలువురు సీనియర్ నాయకులను చిత్తు చేశారు. 

సోషల్ మీడియా స్టార్ అంకితా పర్మార్ ఘన విజయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో సోషల్ మీడియా స్టార్ అంకితా పర్మార్ సంచలనం సృష్టించారు. వడోదరలోని పోర్ జిల్లా పంచాయత్ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆమె ఘన విజయం సాధించారు. అంకితా పర్మార్ అభ్యర్థిత్వం మొదట్లో వివాదాస్పదమైనప్పటికీ.. ఆమె బలమైన ప్రచారం, సోషల్ మీడియాలో ఇమేజ్ ఆమె గెలుపుకు దోహదపడ్డాయి.

ఫోక్ సింగర్ రాజల్ బరోట్ సూపర్ ఎంట్రీ

గుజరాత్ జానపద సంగీత సంచలనం రాజల్ బరోట్ పొలిటికల్ ఎంట్రీని ఘనంగా చాటుకున్నారు. ఉనా మున్సిపాలిటీ నుంచి బరిలోకి దిగిన రాజల్ 2,313 ఓట్ల భారీ మెజారిటీతో రికార్డ్ విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందే ఆమె ప్రజలతో భావోద్వేగపరంగా మమేకమయ్యారని.. ఇదే ఆమె గెలుపులో కీలక పాత్ర పోషించిందంటున్నారు విశ్లేషకులు.

నటి నేహా సుతార్ సునాయాస విజయం

గుజరాతీ నటి-గాయని నేహా సుతార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. బీజాపూర్ తాలూకా పంచాయత్‌లోని కుడేడ స్థానాన్ని ఆమె కైవసం చేసుకున్నారు.  

సూరత్‌లో కావ్య కతీరియా అదరహో

సూరత్‌లో తన భర్త అల్పేష్ కతిరియా రాజకీయ పలుకుబడిని నిలబెట్టుకుంటూ కావ్య కతిరియా మున్సిపల్ కార్పొరేషన్‌లోని 3వ వార్డులో విజయం సాధించారు. ఇటీవల ఆప్ నుంచి బీజేపీలో చేరిన రైతు నాయకుడు రాజు కర్పాడ లాఠీ-2 జిల్లా పంచాయతీ స్థానం నుంచి గెలుపొందారు.

హై-ప్రొఫైల్ అభ్యర్థుల ఓటమి: 

పదవీ విరమణకు కొద్దికాలం ముందు బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి మనోజ్ నినామాకు రాజకీయాల్లో తొలి అడుగులోనే చేదు అనుభవం ఎదురైంది. బేసి నుంచి బరిలోకి దిగిన ఆయన 2,700 ఓట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూశారు. అలాగే, ఆప్ నుంచి బీజేపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే భూపత్ భయానీ భేసన్ జిల్లా పంచాయతీ పోటీలో ఆప్ అభ్యర్థి దినేష్ రూపరేలియా చేతిలో 1,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 

రాజ్‌కోట్‌లో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజాతో ఉన్న సంబంధం కారణంగా ప్రజల దృష్టి ఆకర్షించిన కాంగ్రెస్ అభ్యర్థి నైనాబా జడేజా ఓటమి చవిచూశారు. ఈ ఫలితాలు ఓటర్ల అంచనాల గురించి స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ మారినంత మాత్రాన ఆమోదం లభిస్తుందని గ్యారెంటీ లేదని.. ఓటర్లు అభ్యర్థులను వారి విశ్వసనీయత, స్థానిక సంబంధాల ఆధారంగా అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.