
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫ్యూచర్ సిటీ దిశగా మరో కీలక అడుగు పడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పెట్ గ్రామంలో అత్యాధునిక ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా భూమి పూజ చేశారు. పెరుగుతున్న నగరాన్ని, అంతర్జాతీయ పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ నూతన కమిషనరేట్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది.
ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ఫ్యూచర్ సిటీ రక్షణ ప్రణాళికలను సీఎంకు వివరించారు.
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఈ కమిషనరేట్, అత్యాధునిక టెక్నాలజీతో నేర నియంత్రణలో కీలక పాత్ర పోషించబోతోంది. అభివృద్ధికి శాంతిభద్రతలే పునాది అని చాటుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.