Reading Time: < 1 minute
Golconda Fort Independence Day Celebrations Revanth Reddy

Independence Day : భారత స్వాతంత్య్ర త్య్ర దినోత్సవ (పంద్రాగస్టు) వేడుకల కోసం చారిత్రాత్మక గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ శుభసందర్భంగా గోల్కొండ కోట ప్రాంగణంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకలకు మంత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, విఐపిలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానుండటంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రత్యేక గ్యాలరీలు, వర్షం పడినా ఇబ్బంది లేని వాటర్‌ప్రూఫ్ షామియానాలు

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి వేడుకలకు ఎక్కడా ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేకంగా వాటర్‌ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు దృష్ట్యా విచ్చేసే అతిథులు, ప్రముఖుల కోసం ప్రత్యేక గ్యాలరీలను సిద్ధం చేశారు. అలాగే వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీటి సదుపాయాలు, భద్రత కోసం బారికేడింగ్ , సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టారు. ఈ వేడుకలను తిలకించడానికి నగరంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.

ముగిసిన పరేడ్ రిహార్సల్స్.. వేడుకలకు సర్వం సిద్ధం

స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించే పోలీసు గౌరవ వందనం, పరేడ్ రిహార్సల్స్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. పోలీసు కవాతు , సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చారిత్రక గోల్కొండ కోట ప్రాంగణం పంద్రాగస్టు సంబరాలకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది.