
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కేబినెట్ భేటీలో పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, రవాణా రంగాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది
కేబినెట్ కీలక నిర్ణయాలు
రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0: రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సదస్సును డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. సదస్సు విజయవంతం కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ నేతృత్వంలో ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్‌తో సదస్సు జరగనుంది.
రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఆగస్టు 15 నుంచే ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కొత్తవి, పాతవి కలుపుకుని రాష్ట్రంలో మొత్తం 3 కోట్లకు పైగా రేషన్ కార్డులు ఉండనున్నాయి.
రైతులకు ఈసారి కూడా సన్నవడ్లకు బోనస్ అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే ప్రభుత్వం సూచించిన 7 రకాల వరి వంగడాలకు మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుంది.ఏటీసీలను యంగ్ ఇండియా స్కూల్ పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్ నగరంలో కాలుష్య నియంత్రణ, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 18,766 ఆటోలు నడుస్తుండగా.. వాటిలో ప్రతీ డీజిల్, పెట్రోల్ ఆటోను స్మార్ట్ ఆటోలుగా మార్చాలని నిర్ణయించారు. ఈ మార్పునకు ప్రతి ఆటోకి రూ. లక్షా 50 వేల సబ్సిడీ ఇవ్వనున్నారు.మక్తల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకం ఫేజ్-2 కు ఆమోదం తెలిపింది.