
హైదరాబాద్, వెలుగు: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉంటున్నారు. టెలీకమ్యూనికేషన్స్ విభాగం రూపొందించిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్) సాంకేతికతను వినియోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన్నట్టు సీఐడీ డీజీ చారుసిన్హా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023, ఏప్రిల్ 20 నుంచి తెలంగాణలో సీఈఐఆర్ టెక్నాలజీ వినియోగంలోకి తెచ్చినప్పటి నుంచి ఈ నెల 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,24,850 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్టు పేర్కొన్నారు.
అదేవిధంగా పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లకు సంబంధించి అందిన ఫిర్యాదుల మేరకు మరో 4,82,652 మొబైల్ ఫోన్లను బ్లాక్ చేశామని చెప్పారు. పౌరులు తమ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లకు సంబంధించి www.tspolice.gov.in లోని టీజీ పోలీస్ పౌర పోర్టల్ ద్వారా గానీ, లేదా నేరుగా www.ceir.gov.in ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చని చారుసిన్హా సూచించారు.