Reading Time: 2 minutes

ప్రధాని మోడీ, కొరియా అధ్యక్షుడితో ప్రియాంక మోహన్ విందు.. ‘మేడ్ ఇన్ కొరియా’ పై ప్రశంసలు!

Caption of Image.

కన్నడ బ్యూటీ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం’ మేడ్ ఇన్ కొరియా’  సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల హృదయాలను గెలుచుకుంటుంది. కేవలం వెండితెరపైనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారధిగా ఈ మూవీ నిలుస్తోంది. లేటెస్ట్ గా నటి ప్రియాంక మోహన్ భారత రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక విందులో పాల్గొంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రాష్ట్రపతి భవన్‌లో అరుదైన గౌరవం

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో ఏప్రిల్ 20న  ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశవిదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రానికి లభించిన గుర్తింపుకు ప్రతినిధిగా ప్రియాంక మోహన్ హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక ప్రాంతీయ భాషా చిత్రం, అంతర్జాతీయ దౌత్యవేత్తల సమక్షంలో చర్చనీయాంశం కావడం భారతీయ సినిమా సాధించిన గొప్ప విజయంగా భావించవచ్చని సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు..

భాషలు వేరైనా.. భావోద్వేగం ఒక్కటే!

ఈ మూవీలో ప్రియాంక మోహన్ తో పాటు దక్షిణ కొరియా నటులు పార్క్ హేజిన్, నోహోజిన్ ప్రధాన పాత్రలో నటించారు. తమిళం , కొరియన్ సంస్కృతుల మేళవింపుగా, అత్యంత సహజమైన భావోద్వేగాలతో సాగే ఈ కథ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ముఖ్యంగా రెండు వేర్వేరు దేశాలకు చెందిన వ్యక్తుల మధ్య కలిగే అనుబంధాన్ని దర్శకుడు హృద్యంగా ఆవిష్కరించారు.  రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శ్రీనిధి సాగర్ నిర్మించిన ఈ చిత్రానికి రా. కార్తీక్ దర్శకత్వం వహించారు.  

ప్రియాంక మోహన్ భావోద్వేగ సందేశం

ఈ అద్భుత అనుభవం గురించి ప్రియాంక మోహన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇది నా జీవితంలో మర్చిపోలేని మధుర క్షణం. రాష్ట్రపతి భవనం నుండి ఆహ్వానం అందుకోవడం, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ వంటి మహోన్నత వ్యక్తులనున కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నప్పుడు రాష్ట్రపతి భవనం ఎలా ఉంటుందో అని ఆశ్చర్యపోయేదాన్ని, ఇప్పుడు అక్కడికి వెళ్లడం ఒక కలలా అనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా, కొరియా అధ్యక్షుడు కూడా మన సినిమా గురించి మాట్లాడటం, దానిపై ప్రశంసలు కురిపించడం చూసి నా కళ్ళు చెమర్చాయి. ఈ అవకాశాన్ని ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు, దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.

Also Read : భాగ్యనగరంలో బాస్ ఇంటికి దగ్గర్లో భాయ్ నయా హౌస్

ప్రస్తుతం ‘మేడ్ ఇన్ కొరియా’ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉండటమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఒక తమిళ చిత్రం ఈ స్థాయిలో అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో భాగమవ్వడం నిజంగా గర్వకారణంగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా గ్లోబల్ హిట్ మారిపోయింది. 

 

©️ VIL Media Pvt Ltd.