
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోకాకళ్యాణార్ధం శ్రీస్వామి అమ్మవారికి దేవస్థానం స్వర్ణరథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామునే శ్రీమల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించి అనంతరం స్వర్ణరథోత్సవంలో ఆశీనులైన శ్రీస్వామి అమ్మవారికి అర్చకస్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు.
స్వర్ణరథాన్ని ఆలయ ఎదురుగల గంగాధర మండపం నుండి నంది మండపం వరకు మళ్ళీ నంది మండపం నుండి గంగాధర మండపం వరకు భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు,మేళతాళాలతో వైభవంగా జరిగింది. స్వర్ణరథోత్సవంలో వందలాదిగా స్థానికులు,భక్తులు తరలివచ్చి స్వర్ణరథోత్సవం తిలకించారు. స్వర్ణరథంలో ఆసీనులైన శ్రీస్వామి అమ్మవారు ఆలయ ప్రధాన వీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ప్రతీమాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఈస్వర్ణరథోత్సవాన్ని నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.