
న్యూఢిల్లీ: దేశ రాజధాని- ప్రాంతంలో గ్రనేడ్ దాడులు, కాల్పులు, టార్గెటెడ్ కిల్లింగ్స్‌కు ప్లాన్ చేసిన ఇద్దరు అనుమానితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న గ్యాంగ్‌స్టర్, ఐఎస్ఐ ప్రాక్సీ షాజాద్ భట్టి సూచనల మేరకు వీరు ఈ దాడులకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన రాజ్‌వీర్, వివేక్ బంజారాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ సెల్) ప్రవీణ్ కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ ‘రాజ్‌వీర్ ఢిల్లీలోని ఒక ప్రముఖ హోటల్‌ను టార్గెట్ చేసుకుని దాడి చేయడానికి సిద్ధమవుతుండగా వారిని పట్టుకున్నాం. దీంతో భారీ దాడులను అడ్డుకోగలిగాం’ అని పేర్కొన్నారు. నిందితుల నుంచి ఒక పిస్తోల్, 6 లైవ్ కాట్రిడ్జ్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.