Reading Time: < 1 minute

అధికారంలోకి వచ్చాక బెంగాల్‎లో బహుభార్యత్వాన్ని నిషేధిస్తం: అమిత్ షా

Caption of Image.

కోల్‎కతా: బెంగాల్‎లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో నాలుగు వివాహాల దురాచారంపై నిషేధం విధిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యూనిఫాం సివిల్  కోడ్​ను రాష్ట్రంలో బరాబర్ అమలు చేస్తామని, చొరబాటుదారుల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం బెంగాల్​లోని కుల్టీ, డార్జిలింగ్  జిల్లా కుర్సియోంగ్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. 

ఇనుప ఖనిజం ఉత్పత్తిలో కుల్టీ ఒకప్పుడు దేశానికే హబ్​గా ఉండేదని, మమత ప్రభుత్వం ఆ పరిశ్రమను నాశనం చేసిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ నగరానికి పూర్వవైభవం కల్పిస్తామని, అక్రమ మైనింగ్​ను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కుల్టీ ప్రాంతంలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై నిషేధం విధిస్తామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. 

6 నెలల్లో గూర్ఖాల్యాండ్ సమస్యను పరిష్కరిస్తం

బెంగాల్​లో తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే గూర్ఖాల్యాండ్ సమస్యను పరిష్కరిస్తామని అమిత్ షా పేర్కొన్నారు. ఈ సమస్యను ఒక్క బీజేపీ తప్ప మరే ఇతర పార్టీ కూడా సమర్థంగా పరిష్కరించలేదన్నారు. ‘‘గూర్ఖాల ఆశలు, ఆందోళనను బీజేపీ అర్థం చేసుకుంటుంది. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. మా పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ప్రతి గూర్ఖా ముఖంపై చిరునవ్వు చూస్తారు. వారు ప్రశాంతంగా బతికేలా చూస్తాం” అని షా హామీ ఇచ్చారు. 

గూర్ఖాల సమస్యలను సీఎం మమతా బెనర్జీ పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. తాను కేంద్ర హోంమంత్రి అయిన తర్వాత గూర్ఖాల సమస్యలపై మూడుసార్లు సమావేశాలు పెట్టానని, కానీ మమత ప్రభుత్వం తరపున ఏ ఒక్కరూ ఆ భేటీకి హాజరుకాలేదని విమర్శించారు.

బాబ్రీ మసీదు నిర్మాణాన్ని అడ్డుకుంటం

చొరబాటుదారులను సీఎం మమత కాపాడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న బాబ్రీ తరహా మసీదుకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. తాము పవర్​లోకి వచ్చాక ఆ మసీదు నిర్మాణాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పశ్చిమ మేదినీపూర్​లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మాత్రమే కాదని, బెంగాల్​ను చొరబాటుదారుల నుంచి, అవినీతి, భయం నుంచి కాపాడుకునేందుకని అమిత్​ షా అభివర్ణించారు.

©️ VIL Media Pvt Ltd.