
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కాలేజీల్లో, కేజీబీవీ ఎక్సలెన్స్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఆర్‌జేసీ-సెట్ పరీక్ష వచ్చే నెల 3న నిర్వహించనున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్రమణ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2026–-27 విద్యా సంవత్సరానికిగాను 35 గురుకుల జూనియర్ కాలేజీలు, 93 కేజీబీవీల్లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ (ఇంగ్లీష్ మీడియం) గ్రూపుల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 76,173 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
విద్యార్థుల సౌకర్యార్థం స్టేట్ వైడ్‌గా మొత్తం 320 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏప్రిల్ 27వ తేదీ నుంచి తమ హాల్ టికెట్లను వెబ్‌సైట్ https://tgrjc.cgg.gov.in/TGRJCWEB ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని రమణకుమార్ తెలిపారు. పరీక్ష మే 3న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.