Reading Time: 2 minutes

రైతన్నల ఖాతాల్లోకి రైతుభరోసా డబ్బులు.. రెండో విడత 5వేల 653 కోట్లు రిలీజ్

Caption of Image.
  • రెండు విడతల్లో 5,653 కోట్ల రైతు భరోసా నిధులు రిలీజ్
  • మొదటి విడతలో రూ.3,446.94 కోట్లు.. రెండో విడతలో రూ. 2,206 కోట్లు విడుదల
  • రెండు విడతల్లో 71 లక్షల మంది రైతులకు లబ్ధి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక అండగా నిలుస్తూ రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను విడుదల చేసింది. ఈ సందర్భంగా 45,11,947 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,206.06 కోట్లు జమ అయ్యాయి. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సమయంలో రూ.3,446.94 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రెండో విడతతో కలిపి రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు మొత్తం రూ. 5,653 కోట్లు విడుదల చేసినట్టు అధికారులు వెల్లడించారు.రాష్ట్ర వ్యాప్తంగా భూముల విస్తీర్ణాన్ని బట్టి  రెండెకరాల వరకు ఉన్న రైతులందరికీ నిధులు జమ చేశారు. 

టాప్​లో నల్గొండ జిల్లా

రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు విడతల ద్వారా మొత్తం 71.06 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. జిల్లాల వారీగా నిధుల పంపిణీ ఇప్పటికే పూర్తయింది. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. రైతు భరోసా కింద నల్గొండ జిల్లాలో అత్యధికంగా 5.40 లక్షల మంది రైతులకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ.448.09 కోట్లు జమ అయ్యాయి. ఆ తరువాత ఖమ్మం జిల్లాలో 3.45 లక్షల మంది రైతులకు రూ.271.52 కోట్ల నిధులు అందాయి.  

సంగారెడ్డి జిల్లాలో 3.66 లక్షల మంది రైతులకు రూ.271.05 కోట్లు జమ కాగా,  నాగర్​ కర్నూల్​ జిల్లాలో 3.11 లక్షల మందికి చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ.267.22 కోట్లు  జమ చేశారు. సిద్దిపేట జిల్లాలో 3.28 లక్షల మంది రైతులకు రూ.2.46.30 కోట్ల నిధులు అందాయి. అత్యల్పంగా మేడ్చల్​ మల్కాజిగి జిల్లాలో 25 వేల 530 మంది రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ.15.65 కోట్లు నిధులు అందాయి. అదేవిధంగా ములుగు జిల్లాలో 81 వేల మంది రైతులకు సంబంధించి రూ.66.74 కోట్ల నిధులు అందాయి.

 వ్యవసాయానికి ప్రాధాన్యం: మంత్రి తుమ్మల

రైతుల సంక్షేమానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రైతు భరోసా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, పంటల సాగుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడంలో రైతు భరోసా కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.