Reading Time: 2 minutes

సర్కారు కొలువులకు ఏజ్ పెంచరా..? ప్రభుత్వ మౌనంపై నిరుద్యోగుల్లో ఆందోళన

Caption of Image.
  •     ముగిసిన 46 ఏండ్ల గడువు.. స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
  •     సడలింపుపై సర్కారు మౌనం.. నిరుద్యోగుల్లో ఆందోళన
  •     2 నెలలు చూసి నోటిఫికేషన్ జారీ చేసిన టీజీపీఎస్సీ
  •     సడలింపుపై సర్కారు మౌనం.. నిరుద్యోగుల్లో ఆందోళన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు కొలువుల కోసం నిరీక్షిస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు వయోపరిమితి అంశం ఇప్పుడు శాపంగా మారింది. గతంలో ఇచ్చిన వయోపరిమితి సడలింపు గడువు ముగిసి రెండు నెలలు దాటుతున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు వరుస నోటిఫికేషన్లు వస్తాయని భావిస్తున్న తరుణంలో, వయసు అడ్డంకిగా మారి దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతామేమోనని నిరుద్యోగులు భయపడుతున్నారు.

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు జనరల్ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా ఉంది. అయితే, నోటిఫికేషన్ల జాప్యం దృష్ట్యా గత ప్రభుత్వం తొలుత పదేళ్లు, ఆ తర్వాత మరో రెండేళ్లు కలిపి మొత్తం 12 ఏళ్ల సడలింపునిచ్చింది. దీంతో 46 ఏళ్ల వయసు వరకు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కలిగింది. ఈ సడలింపు ఉత్తర్వుల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీతోనే ముగిసింది. అప్పటి నుంచి కొత్త ఉత్తర్వులు వెలువడకపోవడంతో వయోపరిమితి మళ్లీ పాత పద్ధతికే 34 ఏళ్లకు చేరుకుంది.

రాబోయే నోటిఫికేషన్ల నేపథ్యంలో వయోపరిమితి సడలింపుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ టీజీపీఎస్సీ గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. గడువు ముగిసిపోయిందని, అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కానీ, సర్కారు నుంచి ఇప్పటివరకు ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో నోటిఫికేషన్ల విషయంలో కమిషన్ డైలమాలో పడింది. 

ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా టీజీపీఎస్సీ.. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 గ్రేడ్-2 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో పాత వయోపరిమితి (34 ఏండ్లు + నిబంధనల ప్రకారం వచ్చే సడలింపులు)నే అమలు చేస్తుండటంతో నిరుద్యోగుల్లో కలవరం మొదలైంది. ఇదే పద్ధతి కొనసాగితే రాబోయే నోటిఫికేషన్లలో తాము అర్హత కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

46 ఏండ్లకు పెంచాల్సిందే..!

ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి, కోచింగ్‌‌‌‌లు తీసుకుంటున్న తమను వయసు సాకుతో దూరం చేయవద్దని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. గతంలో ఉన్నట్టుగానే గరిష్ట వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచుతూ వెంటనే జీవో జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే వేలాది మంది నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వాలని వారు వేడుకుంటున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.