
చెన్నై: తమిళ నాడులో బుల్లితెర నటి సుభాషిణి అలియాస్ శశ్వీబాల ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి చెన్నైలోని పోరూర్ సమీపంలో ఉన్న అయ్యప్పంతంగల్‌లోని తన అద్దె నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
శ్రీలంకకు చెందిన 36 ఏళ్ల సుభాషిణి.. టీవీ సీరియళ్ల తోపాటు పలు సినిమాల్లోనూ నటించింది. సుభాషిణి, బెంగళూరుకు చెందిన బిపిన్ చంద్రన్ (38)ను ఏప్రిల్ 2024లో వివాహం చేసుకుంది. పెళ్లీ తర్వాత వీరిద్దరూ బెంగళూరులోనే నివసిస్తున్నారు. చెన్నైలో షూటింగ్ పనులు ఉన్నప్పుడు బస చేసేందుకు వీలుగా, అయ్యప్పంతంగల్‌లోని ఒక ప్రైవేట్ నివాస సముదాయంలో ఆమె ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారని, మార్చి 3న ఆమె నగరానికి చేరుకున్నారని పోలీసులు వెల్లడించారు.
ఆదివారం రాత్రి ఆమె తన భర్తతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతుండగా.. కుటుంబ విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆ కాల్ జరుగుతుండగానే, ఆమె అపార్ట్‌మెంట్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె భర్త తెలిపారు. వెంటనే అపార్ట్‌మెంట్ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు వెంటనే పోరూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను పూనమల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు ఆమె మరణించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.