
పుదుచ్చేరిలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్ర హోదా కల్పిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం లాస్‌పెట్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. పుదుచ్చేరిని అక్కడి ప్రజలు నడపడం లేదని, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆ కేంద్రపాలిత ప్రాంతాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతోందన్నారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
పుదుచ్చేరిలోని నిరుద్యోగ యువతకు నెలకు రూ. 2,000 ఆర్థిక సహాయం అందిస్తామని, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో 30,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని కూడా హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం 40 ఏళ్ల వయస్సు వరకు సడలింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ. 20 లక్షల ఆరోగ్య బీమా అందుబాటులో ఉంటుందని చెప్పారు.
పుదుచ్చేరిలో పారిశ్రామిక, వస్త్ర రంగాలు క్షీణదశలో ఉన్నాయని.. వందలాది ఫ్యాక్టరీలు మూతపడ్డాయని రాహుల్ ఆరోపించారు. పుదుచ్చేరిలో నకిలీ మందుల తయారీ రాకెట్ నడుస్తోందని.. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. “ప్రభుత్వం ఒక వసూలు ఏజెంట్‌గా మారింది. అన్ని కాంట్రాక్టులపై 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని అందరికీ తెలుసు. స్మార్ట్ సిటీలు, రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలకు కమీషన్ తీసుకుంటున్నారు. ప్రతి టోల్ గేట్ వద్ద డబ్బు చెల్లించమని పుదుచ్చేరి ప్రజలను బలవంతం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజల నుంచే కాదు, దేవుళ్ల నుంచి కూడా దొంగిలిస్తోంది. ఆలయ భూములను ఆక్రమించుకుంది” అని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు.