
హైదరాబాద్: లక్షలాది మంది రైతుల భవిష్యత్తు మార్కెట్ పై ఆధారపడి ఉందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మార్కెట్ భూసేకరణ కోసం మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని అన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్ ను హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, నేతలు సందర్శించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ కట్టాలని బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని, మార్కెట్ స్థలాన్ని బిఆర్ఎస్ హయాంలోనే నోటిఫై చేశామని తెలియజేశారు. మార్కెట్ నిర్మాణం కోసం రూ.350 కోట్ల నిధులు బ్యాంక్ ఎకౌంట్లో వేశామని, విదేశాల్లో అధ్యయనం చేసి మార్కెట్ కోసం అద్భుతమైన డిజైన్ ప్లాన్ చేశామని అన్నారు. రూ.1000 కోట్ల అంచనాలతో డిపిఆర్ రూపొందించామని హరీష్ రావు పేర్కొన్నారు.
స్థలం, డబ్బులు సిద్ధం చేసి ఉంచితే భూమిని అమ్ముతామంటున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం స్థలాన్ని కొట్టేయాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మార్కెట్ కడితే ఎంతో మంది రైతులు బాగుపడతారని, సిఎం రేవంత్ రెడ్డి దిల్ భూములలో మార్కెట్ కేటాయిస్తా అంటున్నారని మండిపడ్డారు. దిల్ భూములలో ఎపికి వాటా ఉందని కోర్టు లో కేసు వేశారని, దిల్ భూముల పేరు చెప్పి ఇక్కడ భూమి కొట్లేయాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో ఉన్నభూమి వచ్చేదెప్పుడు మార్కెట్ కట్టేదెప్పుడని ప్రశ్నించారు. ప్రాసెసింగ్ యూనిట్ కోసం కావాలంటే దిల్ భూములు కేటాయించాలని, అంతర్జాతీయ స్థాయలో కోహెడలో మార్కెట్ నిర్మించాల్సిందేనని అన్నారు.
మార్కెట్ యార్డ్ భూములపై కూడా రేవంత్ కన్నుపడిందని, మార్కెట్ కోసం స్థలాన్ని నోటిఫై చేసి నిధులు కూడా కేటాయించామని అన్నారు. రేవంత్ కు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఇక్కడే మార్కెట్ నిర్మించి ఇవ్వాలని సూచించారు. దళారుల కోసం రేవంత్ ఆరాటపడితే బిఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు. లక్షలాది రైతుల భవిష్యత్ కోసం బిఆర్ఎస్ పోరాడుతుందని, రేవంత్ ప్రభుత్వం అంతా భూముల చుట్టూ తిరుగుతుందని అన్నారు. కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని, భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టి రైతుల ఉసురు తీస్తున్నారని, దేవుడు పేరు చెప్పి కూడా భూములు కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోహెడలో మార్కెట్ కోసం పోరాడాలని హరీష్ రావు కోరారు.