
సిర్మౌర్: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సిర్మౌర్ జిల్లా హరిఫుర్‌ధర్ ప్రాంతంలోని మారుమూల కొండ ప్రాంతంలోని రహదారిపై వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కుప్వీ నుంచి సిమ్లాకు ప్రయాణిస్తున్న ఈ బస్సులో సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
వాహనం నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకెళ్లడంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. సిర్మౌర్ జిల్లా ఎస్పీ నిశ్చింత్ సింగ్ నేగి ఘటనను ధృవీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. అందులో పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.