
బంగ్లాదేశ్ కీలకమైన పరిణామ క్రమంలో ఉంది. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆ దేశంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందన్నది కోటి డాలర్ల ప్రశ్న. దీర్ఘకాలం ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా పతనం తర్వాత దేశ రాజకీయ పునర్వ్యవస్థీకరణ విషయంలో ఇది ప్రజాభిప్రాయ సేకరణగా మారింది. దాదాపు ఏడాదిన్నర నుంచి జరిగిన పరిణామాల క్రమంలో బంగ్లాదేశ్ రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్య ప్రమాణాలకు తిరిగి రాగలదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదో పరీక్ష. ఈ ఎన్నికల ప్రభావం బంగ్లాదేశ్ సరిహద్దులకు మించి విస్తరించి ఉంటుంది. భారతదేశం ముఖ్యంగా దాని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు -ఈ ఎన్నికల పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. రానున్న సంవత్సరాలలో ఈ ప్రాంతీయ సుస్థిరత, వలసల క్రమం, భద్రతా సహకారం, ద్వైపాక్షిక సంబంధాలపై బంగ్లాదేశ్‌నుంచి ఎదురయ్యే పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.
ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజకీయ నేపథ్యం అత్యంత అసాధారణంగా, అస్థిరంగా ఉంది. చరిత్రాత్మకంగా -సెంట్రల్ – రైట్ జాతీయవాదశక్తిగా నిలుస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) ఓ నిర్ణయాత్మక పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తోంది. ఇస్లామిస్ట్ జమాత్ -ఇ- ఇస్లామీతో దశాబ్దాలుగా ఉన్న పొత్తును తెగతెంపులు చేసుకోవడం ద్వారా. బిఎన్‌పి ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన అవామీలీగ్ ద్వారా ఏర్పడిన శూన్యాన్ని ఉదారవాద ప్రజాస్వామ్య స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోంది. షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత అవామీలీగ్ పార్టీని పూర్తిగా నిషేధించడం ఇందుకో కారణం. ఇటీవలి విశ్లేషణలలో తేలింది ఏమిటంటే.. 2024 తర్వాత బంగ్లాదేశ్ ఇకపై నిరంకుశత్వాన్ని, బలమైన సైద్ధాంతిక కూటములను అంగీకరించబోదన్నది తేటతెల్లం.
హసీనా 15ఏళ్ల పాలనకు స్వస్తి పలికిన యువత ఆధ్వర్యంలోని తిరుగుబాటునుంచి ఆవిర్భవించిన నేషనల్ సిటిజన్ పార్టీ బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళాన్ని మరింత పెంచింది. కొద్దిపాటి రాజ్యాంగ మార్పులతో ముందస్తు ఎన్నికలకు బిఎన్‌పి పట్టుబడుతుండగా, జమాత్, ఎన్‌సిపి మాత్రం ఎన్నికల వ్యవస్థను బిఎన్‌పి విజయానికి అనుకూలంగా మారుస్తున్నారని హెచ్చరికలు చేస్తున్నాయి.ఈ ఆరోపణలు నిజమైనా లేకున్నా, బంగ్లాదేశ్‌లో ఎన్నికల విశ్వసనీయతపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. భారతదేశం లోనూ కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
భారతదేశానికి సంబంధించినంతవరకూ బంగ్లాదేశ్ రాజకీయ పథం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. గత దశాబ్దంన్నరకాలంగా హసీనా ప్రభుత్వం దక్షిణాసియాలో భారతదేశానికి అత్యంత విశ్వసనీయమై భాగస్వామిగా పరిగణించబడింది. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు నిరోధక చర్యలలో సహకారం, తీవ్రవాద గ్రూప్‌లకు వ్యతిరేకంగా చేపట్టిన నిఘా కార్యకలాపాలలో భాగస్వామ్యం, ఈశాన్య రాష్ట్రాలకు రవాణా వ్యవస్థ, ప్రధాన కనెక్టివిటీ ప్రాజెక్టులు అన్నీ ఈ సంబంధానికి మరింత దోహదపడ్డాయి. హసీనా హయాంలో నియతృత్వ పోకడలు, మానవహక్కుల ఉల్లంఘనపై ఆందోళనలు హెచ్చినా బంగ్లాదేశ్ భూభాగంనుంచి పనిచేసే భారత వ్యతిరేక తిరుగుబాటు గ్రూప్‌లకు వ్యతిరేకంగా, అవామీ లీగ్ అనుసరించిన కఠిన వైఖరి భారత భద్రతా వ్యవస్థకు సంబంధించినంత వరకూ హసీనాకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
బిఎన్‌పి నేతృత్వంలోని ప్రజాస్వామ్య సంస్కరణలను నిజంగా స్వీకరించే ప్రభుత్వం ఏర్పడితే, భారతదేశంతో సంబంధాలను ఆటోమాటిక్‌గా పూర్తిస్థాయిలో దెబ్బతీయదు. అయినా అనిశ్చితులు వాస్తవమే. చరిత్రాత్మకంగా బిఎన్‌పి లోని కొన్నివర్గాలు భారతదేశంపట్ల ఎక్కువ సందేహాలను కలిగి ఉన్నాయి. జమాత్‌తో ఆ పార్టీకి గతంలో ఉన్న పొత్తు నేపథ్యంలో జమాత్ మతపరమైన తీవ్రవాదం, సరిహద్దు తీవ్రవాదం గురించి భారతీయుల ఆందోళనలను పెంచింది. ప్రస్తుతానికి జమాత్‌తో బిఎన్‌పి దూరం అయినా, ఆ పార్టీతో ద్వైపాక్షిక సంబంధాలను తెగతెంపులు చేసుకోకుండా కొనసాగించే విషయాన్నే భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
పశ్చిమ బెంగాల్‌తో ప్రారంభించి, భారతదేశ సరిహద్దు రాష్ట్రాలు ఆ దేశాన్ని ఆనుకునే ఎక్కువగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని భారత- బంగ్లాదేశ్ సరిహద్దు పొడవు వెంబడి, జనసాంద్రత ఎక్కువగా ఉంది. అంతేకాదు సరిహద్దు అంతటా లోతైన సాంసృ్కతిక, భాషా, కుటుంబ సంబంధాలు కలిగి ఉంది. బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడినా, ఎన్నికలలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చినా, ఆ దేశంలో అశాంతి ప్రబలి, కొత్తగా వలసలు తలెత్తే అవకాశం లేకపోలేదు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే నెలకొన్న రాజకీయ వాతావరణంలో ఇదో సున్నితమైన సమస్య కాగలదు. బంగ్లాదేశ్‌లో ఎలాంటి మతపరమైన చిచ్చురేగినా, మతపరమైన సమీకరణలు జరిగినా, అది బెంగాల్ చర్చలలో ప్రతిబింబిస్తుంది. దీనిని రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్‌లను కూడగట్టుకునేందుకు ఉపయోగించుకుంటాయి. బంగ్లాదేశ్‌తో బహుళ స్థాయిలో కీలక సంబంధాలు పంచుకునే ఈశాన్య రాష్ట్రాలలో పరిస్థితి మరింత సున్నితంగా ఉంది. అసోం, త్రిపుర, మేఘాలయ వంటి రాష్ట్రాలు సరిహద్దు వెంబడి జరుగుతున్న పరిణామాలవల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
అసోంలో పౌరసత్వం, వలస, గుర్తింపులకు సంబంధించిన చర్చలు చాలా కాలంగా బంగ్లాదేశ్ నేపథ్యం, అవగాహనల చుట్టూ తిరిగాయి. బంగ్లాదేశ్‌లో ఎన్నికలలో హంగ్ ఏర్పడినా, అనిశ్చిత పరిస్థితులు తలెత్తినా, అక్రమ వలసలపై ఆందోళనలు రేకెత్తవచ్చు. రాష్ట్రంలో సామాజిక ఐక్యతను పాలనను క్లిష్టతరం చేయవచ్చు. భద్రతాపరంగా భారతదేశం ఆందోళనలకు ప్రధాన కారణం రానున్న ఎన్నికలలో బంగ్లాదేశ్‌లో తీవ్రవాద శక్తులు ఏ మేరకు బలపడతాయన్నదే. జమాతే ఇస్లామీ రాజకీయ ప్రభావం తగ్గిపోయినా, దాని నెట్‌వర్క్‌లు చురుగ్గా ఉన్నాయి. ఎన్నికల తర్వాత వెలువడే తీర్పు అనిశ్చితంగా ఉన్నా, ఎన్నికల తర్వాత దీర్ఘకాలంపాటు అశాంతి ప్రబలినా, రాడికల్ శక్తులు బలపడేందుకు అది దోహదం చేయవచ్చు. కొన్ని దశాబ్దాలపాటు తిరుగుబాటు నుంచి ఈమధ్యనే బయటపడిన ఈశాన్య రాష్ట్రాలకు, సరిహద్దులలో ఏమాత్రం అస్థిరత ఏర్పడినా తీవ్ర కలవరం తప్పదు.
హసీనా హయాంలో సాగిన నిరంకుశపాలన, బంగ్లాదేశ్ సమాజంలో పట్టణ, మధ్యతరగతి వర్గాలను, ముఖ్యంగా యువతను ఆమెకు దూరం చేసింది. 2024 నాటి ప్రజా తిరుగుబాటు సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన, న్యాయం, స్వాతంత్రం, పౌరస్వేచ్ఛ పట్ల ప్రజలకు గల బలమైన ఆకాంక్షను ప్రతిబింబించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఆవిష్కరించుకున్న భారతదేశం, బంగ్లాదేశ్‌లో నిజమైన ప్రజాస్వామ్య మార్పునకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతంలో దాని పట్ల విశ్వసనీయతను పెంచుతుంది. 1971 విముక్తి పోరాటం నాటి నైతిక స్ఫూర్తిని తిరిగి పొందేందుకు బిఎన్‌పి చేసిన ప్రయత్నం చాలా ముఖ్యమైనది. స్వాతంత్య్రాన్ని వ్యతిరేకించిన జమాతే ఇస్లామీకి దూరం జరగడం ద్వారా, 1971 స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని పెంచడంతోపాటు జాతీయ ఐక్యతకు దోహదపడుతుంది. ఆ పార్టీ విముక్తి పోరాటానికి సంబంధించిన క్రెడిట్‌పై అవామీలీగ్ సాగించిన గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తోంది. 1971 వారసత్వం ద్వైపాక్షిక సంబంధాలకు ఉమ్మడి గీటురాయి. కాబట్టి బిఎన్‌పి వైఖరిలో మార్పు భారతదేశానికి ఎంతైనా ముఖ్యమైనది.
బంగ్లాదేశ్‌లో ప్రత్యేక జాతీయవాదం లేదా మతపరమైన గుర్తింపు కంటే, ప్రజాస్వామ్యం, మనవ హక్కులకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఏర్పడితే భారతదేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఎన్నికలలో ఆర్థిక పరమైన అంశాలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. దక్షిణాసియాలో భారతదేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలలో బంగ్లాదేశ్ ఒకటి. రెండు దశాబ్దాలుగా, రెండు దేశాల మధ్య స్థిరమైన ఆర్థిక వృద్ధి, సరిహద్దు పెట్టుబడులు, కనెక్టివిటీకి అవకాశాలను సృష్టించింది. రాజకీయ అస్థిరత, దీర్ఘకాలిక అనిశ్చితి ఏర్పడినా ఈ పరిస్థితిని దెబ్బతీయవచ్చు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు. సరిహద్దుకు ఇరువైపులా పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీయవచ్చు. యాక్ట్ ఈస్ట్ విధానం కింద ఆగ్నేయాసియా దేశాలకు ప్రవేశద్వారంగా స్థానం పొందిన భారతదేశం ఆ దేశాలను చేరాలంటే, బంగ్లాదేశ్ సహకారం ఎంతైనా అవసరం.
అయితే, రిస్క్ లేకపోలేదు. బిఎన్‌పి సైద్ధాంతికంగా ఏమేరకు మారుతుంది. మాటలలో చూపే మార్పు చేతలలో ఉంటుందా అన్నది ముఖ్యం. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, మైనారిటీలను చేర్చుకోవడం, సంస్థాగత చర్యల విషయం లో దాని తీరు గమనించవలసి ఉఁటుంది. మెజారిటీ వాదం వైపు మొగ్గి, రాజకీయంగా వెనుకడుగు వేస్తే, తక్షణ పరిణామాలు ఉంటాయి. యువత నేతృత్వంలోని పార్టీలు, పౌరసమాజ సమూహాలు లిబరల్ -సెంట్రల్ ఓటుకోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఏర్పడే రాజకీయ రంగం పాలనను క్లిష్టతరం చేసే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ ఎన్నికల నేపథ్యంలో భారతదేశం తటస్థంగా, అంటీముట్టనట్లు ఉండడం ఓ సవాల్. బంగ్లాదేశ్ లోని ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా అనుకూలంగా ఉన్నట్లు కన్పించినా, ఫలితాలు ప్రతికూలంగా ఉండవచ్చు. బాహ్య జోక్యం ఉందనే అనుమానాలను పెంచుతుంది. అందుకు బదులు భారతదేశం దృష్టి అందరినీ కలుపుకునిపోయే ఎన్నికల ప్రక్రియను సమర్థించడంతోపాటు, ద్వైపాక్షిక నిబద్ధతలను గౌరవిస్తే, ఏ ప్రభుత్వం ఏర్పడినా, దానితో కలిసి పని చేయడానికి సంసిద్ధతను సూచించినట్లు కాగలదు.
తుది విశ్లేషణ ఏమిటంటే, బంగ్లాదేశ్ ఫిబ్రవరి ఎన్నికలు దాని ప్రజాస్వామ్య భవిష్యత్‌కే కాక, తూర్పు ఉపఖండానికి కూడా కీలకమైనవి. శాంతియుతమైన, స్పష్టమైన మార్పు, దీర్ఘకాలంగా రాజకీయ ఇబ్బందుల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని స్థిరీకరించగలదు. ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేస్తుంది. దీనికి విరుద్ధంగా, వివాదాస్పదమైన పరిస్థితి తలెత్తితే కొత్త సమస్యలకు తెరలేపుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలు దేశీయ ఆధిపత్య పోరాటం కాదు. ఎన్నికలు ఎలా జరుగుతాయి. ఫలితం ఎలా ఉంటుందన్నది భారతదేశం బంగ్లాదేశ్ సంబంధాలను నిర్ణయిస్తాయి.దక్షిణాసియా ప్రజాస్వామ్య పునరుద్ధరణ వైపు అడుగులు వేస్తుందా, అపనమ్మకం, అస్థిరత చక్రాలలోకి తిరిగి జారి పోతుందా.. అని నిర్ణయిస్తాయి.
గీతార్థ పాఠక్