Reading Time: 2 minutes

అమెరికాలో హైదరాబాద్‌కు చెందని యువతి హత్యకు గురైంది. తెలుగమ్మాయి నిఖిత దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. హైదరాబాద్, తార్నాక, విజయపురి కాలనీకి చెందిన ఆనంద్ కూతురు నిఖిత(27) నాలుగేళ్ల క్రితం అమెరికా దేశానికి ఉన్నత చదువుల కోసం వెళ్లింది. చదువు పూర్తయిన తర్వాత మేరీ ల్యాండ్‌లోని కొలంబియాలో ఉంటూ డేటా అనలిస్ట్‌గా ఉద్యోగం చేస్తోంది. నిఖిత, తమిళనాడు రాష్ట్రానికి చెందిన అర్జున్ శర్మ గతంలో రూమ్మేట్స్‌గా ఉన్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్జున్ శర్మ నాలుగున్నర వేల డాలర్లు అప్పుగా ఇవ్వాలని, వాటిని త్వరలోనే తీరుస్తానంటూ నిఖితను కోరాడు. అందుకు ఒప్పుకున్ననిఖిత, అర్జున్ శర్మకు డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఇచ్చి చాలా రోజులు అవుతున్నా అర్జున్ శర్మ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అడిగేందుకు అతడి రూమ్‌కు వెళ్లింది.

అక్కడికి వెళ్లి డబ్బులు అడగడంతో కోద్రిక్తుడైన అర్జున్, నిఖితపై దాడి చేసి తన వద్ద ఉన్న వెయ్యి డాలర్లను ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. తర్వాత నిఖితన కత్తితో హత్య చేశాడు, తర్వాత పోలీసులకు నిఖిత కన్పించడంలేదని ఫిర్యాదు చేసి అదే రోజు ఇండియాకు పారిపోయి వచ్చాడు. అర్జున్ ఇంటికి వెళ్లి నిఖిత తిరిగి రాకపోవడంతో ఆమె స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెళ్లి అర్జున్ ఇంటిలో చూసేసరికి నిఖిత మృతిచెంది ఉంది. నిఖిత శరీరంపై కత్తి గాయాలు ఉండడంతో అర్జున్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అర్జున్ కోసం వెతికిన పోలీసులు అర్జున్ శర్మ ఇండియాకు పారిపోయినట్లు గుర్తించి ఇంటర్ పోల్‌కు ఫిర్యాదు చేశారు. తమిళనాడులో ఉన్న అర్జున్ శర్మను ఇంటర్ పోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిఖిత కుటుంబ సభ్యులను బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తార్నాకలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

తన కూతురు వద్ద అర్జున్ శర్మ తన కూతురి వద్ద డబ్బులు అప్పుగా తీసుకున్నాడని, వాటిని తిరిగి అడిగితే హత్య చేశాడని నిఖిత తండ్రి ఆనంద్ తెలిపారు. తన కూతురికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని, చివరిగా డిసెంబర్ 31న ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పిందని, అదే చివరి మాట అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తన కూతురు మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. డబ్బుల విషయంలోనే అడగడానికి అర్జున్ దగ్గరికి నిఖిత వెళ్లినట్లు ఆమె స్నేహితులు చెప్తున్నారని తెలిపారు. నిఖితను చంపేసిన తర్వాత ఏమీ ఎరగనట్టు , ఆమె కనిపించడం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చాడని, అమెరికా నుంచి పారిపోయి ఇండియాకి వచ్చాడని తెలిపారు.