Reading Time: 2 minutes

Vishal: జీవితం ఇంత అనిశ్చితమా? ఆర్‌బీ చౌదరి మృతిపై విశాల్ ఎమోషనల్ ట్వీట్

Caption of Image.

సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌‌‌‌ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు వంద  సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఆర్‌‌‌‌బీ చౌదరి  కన్నుమూశారు. మంగళవారం  (April5, 2026) ఉదయ్‌‌పూర్‌‌‌‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మృతితో  సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనయ్యియింది.   ఈయన అసలు పేరు రతన్‌‌లాల్ భగత్‌‌రామ్ చౌదరి. ఈయన రాజస్థానీ కుటుంబానికి చెందిన వారు. మొదట్లో   ఉక్కు, ఎగుమతులు, నగలు మొదలైన వ్యాపారాలు చేసి తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు.

మొదటిగా 1988లో ‘ఆడిపాపం’ అనే మలయాళ చిత్రాన్ని నిర్మించారు. మరో రెండు మలయాళ మూవీస్ తర్వాత 1990లో ‘పుదు వసంతం’ అనే తమిళ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్నుంచీ వరుస తమిళ మూవీస్ నిర్మించారు.  తమిళనాట సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న హీరో  విజయ్‌కు.. పూవే ఉనక్కగా, తుళ్ళధ మనముం తళ్ళుం, తిరుపాచ్చి వంటి కెరీర్‌‌ బెస్ట్ చిత్రాలను అందించారు ఆర్‌‌బీ చౌదరి.

ఇక 1994లో శరత్ కుమార్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో  ‘కెప్టెన్’ అనే చిత్రాన్ని తెలుగులో నిర్మించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌‌తో సుస్వాగతం, వెంకటేష్‌‌తో సూర్యవంశం, రాజా, శీను, సంక్రాంతి లాంటి  చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. అలాగే నాగార్జునతో నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా సినిమాలను నిర్మించి విజయాలను అందుకున్నారు. నేటి గాంధీ, ప్రియమైన నీకు, సింహరాశి, స్నేహమంటే ఇదేరా, శివరామరాజు, అందాల రాముడు, అన్నవరం, నవ వసంతం, గోరింటాకు, భీమిలి కబడ్డీ జట్టు, రచ్చ లాంటి చిత్రాలను నిర్మించి  తెలుగులో మంచి ఇమేజ్ ఏర్పరచుకున్నారు.

విశాల్ ఎమోషనల్ ట్వీట్..

ప్రస్తుతం విశాల్ హీరోగా దర్శకుడిగా రూపొందిస్తున్న ‘మకుటం’ చిత్రాన్ని ఆర్బీ చౌదరి 99వ మూవీగా నిర్మిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌‌‌‌పై తెరకెక్కుతోన్న 99వ చిత్రమిది. ఆయన మరణ వార్త తెలుసుకున్న మూవీ టీమ్ సెట్‌‌లోనే ఆయనకు నివాళులు అర్పించారు.

ఈ క్రమంలోనే విశాల్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘అత్యంత ప్రతిభావంతుడైన నిర్మాత ఆర్.బి.చౌదరి గారి మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. షూటింగ్ మధ్యలో ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. మాటలు రావడం లేదు. జీవితం ఎంత అనిశ్చితమైనది. భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఆయన ఒకరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జీవా, జిథన్ రమేష్, సురేష్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ విషాదం నుండి కోలుకునే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’’ అని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే తెలుగు, తమిళ పరిశ్రమకు సంబంధించిన సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలియజేశారు. ఆయనకు నలుగురు సంతానం. వారిలో కుమారులు జీవా, జితన్ రమేష్ ఇద్దరూ సౌత్ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. జీవాకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. 

©️ VIL Media Pvt Ltd.