Reading Time: < 1 minute

తమిళనాడు ఎన్నికల్లో ఓటమిపై స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్

Caption of Image.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై స్టాలిన్ ఆయన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. ప్రజల తీర్పుకు తాము తలవంచి అంగీకరిస్తున్నామని, విజేతలకు స్టాలిన్ అభినందనలు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో, తాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి.. అమలు చేసి తమిళనాడు ప్రజలకు సుపరిపాలన అందించామని స్టాలిన్ చెప్పారు. తమిళనాడును అన్ని విధాలుగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లామని, ఎన్నికల ప్రచారంలో కూడా తాము సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ మాత్రమే ఓట్లు అభ్యర్థించామని గుర్తుచేశారు.

ప్రజలకు తాము అందించిన సంక్షేమ పథకాలు కొనసాగేలా చూసేందుకే గెలిపించాలని కోరామని స్టాలిన్ స్పష్టం చేశారు. ద్రవిడ మున్నేట్ర కజగం నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమికి మద్దతునిచ్చి, ఓటు వేసిన తమిళనాడు ఓటర్లకు స్టాలిన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తాను డీఎంకేకు ఓటు వేసిన వారి కోసమే కాకుండా.. ఓటు వేయని వారి సంక్షేమం కోసం కూడా పనిచేశానని స్టాలిన్ చెప్పుకొచ్చారు. తాను ప్రజలందరికీ నిజాయితీగా పాలన అందించానని, మనస్సాక్షికి కట్టుబడి పనిచేశానని తెలిపారు.

తమిళనాడు అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేశానని, తన లాగే క్షేత్రస్థాయిలో శ్రమించిన కరుణానిధి ప్రియమైన సహచరులకు స్టాలిన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమతో భుజం భుజం కలిపి నిలిచిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు చెప్పారు. తన రాజకీయ జీవితంలో తాను గొప్ప విజయాలను చూశానని, అపజయాలను కూడా చవిచూశానని స్టాలిన్ గుర్తుచేశారు. 

అందువల్ల.. కేవలం గెలుపు ఓటములు కాదని, ఆదర్శాలు, సిద్ధాంతాలు ముఖ్యమనే భావనతో వ్యవహరిస్తానని తమిళనాడు ప్రజలకు డీఎంకే అధ్యక్షుడు మాటిచ్చారు. డీఎంకే రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తుందని, ఇప్పటివరకు ప్రజలకు నీతిమంతమైన పాలన అందించిన పార్టీగా పనిచేసిన డీఎంకే.. ఇకపై ప్రజా సమస్యలపై పోరాడే ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తుందని స్టాలిన్ చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.