Reading Time: < 1 minute

1991 సీన్ రిపీట్ అవుతోందా..? చెన్నైలో డీఎంకేకు చుక్కలు చూపిస్తున్న టీవీకే!

Caption of Image.

చెన్నై అంటే దశాబ్దాలుగా డీఎంకేకు ఒక బలమైన కోట. కానీ ఈరోజు ఆ కోటకు ఒక పెద్ద బీట పడింది. నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) చెన్నైలో అనూహ్యమైన ఫలితాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

 డీఎంకే క్లీన్ స్వీప్
గడిచిన కొన్ని ఎన్నికలను చూస్తే చెన్నై పూర్తిగా డీఎంకే గుప్పిట్లోనే ఉంది. 2021 ఎన్నికల్లో చెన్నైలోని మొత్తం 16 స్థానాల్లో డీఎంకే కూటమి 16కి 16 గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. 2022 మున్సిపల్ ఎన్నికల్లో 200 వార్డులకు గాను డీఎంకే కూటమి ఏకంగా 178 వార్డులను గెలుచుకుంది. ఒక్క డీఎంకేనే 153 వార్డులను గెలుచుకోగా, ఏఐఏడీఎంకే కేవలం 15 వార్డులను మాత్రమే గెలుచుకోగలిగింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో చెన్నైలోని మూడు ఎంపీ స్థానాల్లోనూ డీఎంకే భారీ మెజార్టీతో గెలిచింది.

ప్రస్తుతం సీన్ రివర్స్
ఇంతటి బలమైన పట్టున్న చెన్నైలో ఇప్పుడు విజయ్ పార్టీ గాలి వీస్తోంది. చాలా నియోజకవర్గాల్లో డీఎంకేను రెండో స్థానానికి నెట్టేసి, టీవీకే అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కొలత్తూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆధిక్యంలో ఉండటం కోసం కష్టపడాల్సి వస్తోంది. అక్కడ టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు గట్టి పోటీ ఇస్తూ ఆధిక్యంలో ఉండటం సంచలనంగా మారింది. సుబ్రమణియన్ (సైదాపేట), శేఖర్ బాబు (దురైముగం) వంటి సీనియర్ మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. చేపాక్ నియోజకవర్గంలో ఉదయనిధి స్టాలిన్ మాత్రం తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటున్నారు.

మళ్ళీ 1991 నాటి పరిస్థితి
గతంలో 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో డీఎంకే రాష్ట్రమంతటా కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో డీఎంకేకు చెన్నైలో దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ముఖ్యంగా యువత, నగరాల్లో ఉండే ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపడం వల్ల డీఎంకే విజయావకాశాలు మసకబారాయి.
 
ఇప్పటివరకు చెన్నై అంటే డీఎంకే అడ్డా అనుకునేవారు, కానీ ఇప్పుడు ఆ అడ్డాలో విజయ్ ‘దళపతి’గా మారుతున్నారు. ఈ ఫలితాలు తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి!

©️ VIL Media Pvt Ltd.