
తమిళనాడు అనగానే కులం.. డీఎంకే పార్టీ అయినా.. అన్నా డీఎంకే పార్టీ అయినా.. కులాన్ని కాదని.. కులాన్ని పక్కనపెట్టి రాజకీయం చేసే పరిస్థితి లేదు. 70 ఏళ్లుగా ఇదే జరుగుతుంది. విజయ్ పార్టీ పెట్టినప్పుడు అందరూ ఇలాగే అనుకున్నారు.. ఆయన కులం, మతం బయటకు వచ్చింది. విజయ్ కులం ఏంటీ.. విజయ్ మతం ఏంటీ అని అందరూ ఆరా తీశారు.. కులం, మతంపై బురద జల్లారు.
విజయ్ అలాంటి వార్తలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అసలు తన కులం, మతంపై ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఎన్నికల ప్రచారంలోనూ కులం, మతం జోలికి వెళ్లలేదు.
రెండేళ్ల రాజకీయ ప్రస్థానంలో పార్టీలోనూ కులం, మతం ప్రాతిపదికన ఎప్పుడూ ఆలోచన చేయకపోగా.. పార్టీలో కులం, మతం అంశాలకు అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ క్రమంలోనే యువతలో విజయ్ కొత్త తరం రాజకీయం చేస్తున్నారనే ప్రచారం బలపడింది. అందుకు తగ్గట్టుగానే తమిళనాడులో కొత్తగా ఓటు హక్కు సాధించిన 12 లక్షల 50 వేల మంది యువత మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. తన వ్యూహం పట్టణం, అర్బన్ ఏరియాల్లో బాగా వర్కవుట్ అయ్యింది. రూరల్ ఏరియాల్లో మాత్రం నిరాశనే అని చెప్పొచ్చు.
నియోజకవర్గాల్లోనూ కుల ప్రాతిపదికన టికెట్లు ఇవ్వలేదు. చాలా నియోజకవర్గాల్లో ఎక్కువ ఓటర్లు ఉన్న కులాన్ని కాదని.. మరో కులానికి చెందిన వ్యక్తిని పోటీకి నిలబెట్టాడు. ఇదే సమయంలో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల్లో ఉన్న కుల ప్రాతిపదిక, ప్రాంతాల వారీగా అభ్యర్థుల ఎంపిక, కుల సమీకరణాలు, పార్టీల పొత్తులు ఇలాంటి అంశాలు అన్నింటికీ భిన్నంగా విజయ్ తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. పార్టీ అభ్యర్థి గెలుస్తాడా లేదా.. పార్టీ విధానాలకు అనుగుణంగా పని చేస్తాడా లేదా.. ఓటేసిన జనానికి సేవ చేస్తాడా లేదా అన్న విధంగానే విజయ్ తన ఎన్నికల ప్రచారం చేశాడు.
ALSO READ : బెంగాల్ గడ్డపై బీజేపీ విజయానికి 5 కారణాలు.. మమతను దాటి కమలం ఎలా వికసించిందంటే?
ఈ వ్యూహమే మిగతా పార్టీలను మట్టి కరిపించింది. సంప్రదాయ కుల గుర్తింపు పార్టీలను తటస్తులు, యువత కలిసి ఓడించారు. నేటి యువత.. జనరేషన్ జెడ్ వాళ్లకు విజయ్ మాటలు, రాజకీయం కొత్తగా అనిపించింది. విజయ్ వ్యూహం వందకు వంద శాతం ఫలించిందా అంటే లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. 234 నియోజకవర్గాల్లో విజయ్ సెంచరీ సీట్లు కొట్టాడు. అంటే మిగిలిన సంప్రదాయ పార్టీలు అన్ని కలిపి సగంపైనే సీట్లు సాధించాయి.
విజయ్ వ్యూహం అర్బన్.. పట్టణ ప్రాంతాల్లో బాగా వర్కవుట్ అయ్యింది. చెన్నై సిటీ, కోయంబత్తూర్, పెరంబదూర్, ఇతర అర్బన్.. పట్టణ ఓటర్ల బ్రహ్మరథం పట్టారు. రూరల్ ఏరియాల్లో మాత్రం విజయ్ టీవీకే పార్టీ గట్టి ఎదురుదెబ్బనే ఎదుర్కొంది అని చెప్పొచ్చు.