Reading Time: < 1 minute

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 6 వేల కోట్లు..జూన్ 1 లోగా హెల్త్ కార్డులు

Caption of Image.

తెలంగాణ  సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమంపై సీఎం నాలుగు అంశాలపై  స్పష్టత ఇచ్చారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 6వేల కోట్లు .. జూన్ 1 లోగా హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. అలాగే పీఆర్సీపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన సీఎం.. నివేదిక అందిన వెంటనే  నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలని సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడంలో ఉద్యోగుల పాత్ర వెలకట్టలేనిదని ఆయన ప్రశంసించారు.

ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ..  ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని ప్రకటించినా, ఉద్యోగులు తమ భుజాన వేసుకుని పనిచేశారు. మీ సహకారంతోనే మేము పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నాం. అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మొదటి నిర్ణయం ఉద్యోగుల కోసమే తీసుకున్నాం. ఏళ్ల కాలంగా ఉన్న నిరీక్షణకు తెర దించుతూ.. ప్రతి నెలా ఒకటో తారీఖునే జీతాలు అందేలా చర్యలు చేపట్టాం.గతంలో ఎన్నడూ లేని విధంగా, ఈ రెండేళ్ల ప్రజా ప్రభుత్వంలో 67,760 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా ప్రజాస్వామ్య పద్ధతిలో అవకాశం కల్పించాం. వివాదాలకు తావులేకుండా టీచర్ల బదిలీలను పారదర్శకంగా పూర్తి చేశాం. ఇది మీ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది  అంటూ ఉద్యోగుల్లో సీఎం భరోసా నింపారు రేవంత్. 

నాలుగు కీలక హామీలు

  •  వంద రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం రూ. 6 వేల కోట్లు విడుదల చేస్తాం.
  • పీఆర్సీపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. నివేదిక అందిన వెంటనే  నిర్ణయం తీసుకుంటాం.
  •   ఆరోగ్య భద్రత కార్డులను జూన్ 1వ తేదీ లోగా అందజేస్తాం.
  •  ప్రతి రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలి.
©️ VIL Media Pvt Ltd.