
హైదరాబాద్: తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగులతో కలిసి సెక్రటేరియట్‌ని ముట్టడిస్తామని హెచ్చరించారు. శనివారం (మే 2) సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులతో హరీష్ రావు ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దంటున్నారని సీఎం రేవంత్ చెబుతున్నారు.. కానీ నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.
ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకువచ్చి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మించి మోసం చేశారని విమర్శించారు. నమ్మించి వంచించడం కాంగ్రెస్ నైజమని ధ్వజమెత్తారు. నోటిఫికేషన్ల కోసం ఆందోళన చేస్తోన్న నిరుద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి పోలీసులతో దాడి చేయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భర్తీ చేసింది కేవలం 16 వేల ఉద్యోగాలేనని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు.. మిగిలిన 1.84 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలీస్ శాఖలో 19 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని డీజీపీ చెప్పారు.. కానీ 5 వేల ఉద్యోగాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చి మిగతా 14 వేల పోస్టులను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. విద్యా కమిషన్ రిపోర్ట్‌ని ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు.
ప్రభుత్వం వేస్తానన్న మెగా డీఎస్సీ కాస్త దగా డీఎస్సీ అయిపోయిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా డ్రామాలు బంద్ చేయాలని చురకలంటించారు. నిరుద్యోగులకు కావాల్సింది మీ చిల్లర మాటలు కాదని.. జాబ్ నోటిఫికేషన్లు కావాలని అన్నారు. జాబ్ క్యాలెండర్ కాస్తా జాబ్ లెస్ క్యాలెండర్ అయ్యిందని ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క ఉద్యోగమైన భర్తీ చేశారా అని ప్రశ్నించారు.