Reading Time: < 1 minute

వన్యప్రాణి సంరక్షణకు ప్రాధాన్యత..  అభివృద్ధికి ‘గ్రీన్’ సిగ్నల్!

Caption of Image.
  • వన్యప్రాణి మండలి స్టాండింగ్​ కమిటీ భేటీలో నిర్ణయాలు
  • అమ్రాబాద్‌ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణతోపాటు అటవీ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర వన్యప్రాణి మండలి స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం నెహ్రూ జూలాజికల్ పార్కులో మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన కమిటీ తొలి సమావేశం జరిగింది. రక్షిత అటవీ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియను కమిటీ సమీక్షించింది.

నాలుగు గ్రామాలకు చెందిన 417 కుటుంబాల పునరావాసంపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఇందులో 160 కుటుంబాలు నేరుగా నగదు పరిహారాన్ని తీసుకునేందుకు అంగీకరించగా, ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షలు వారి ఖాతాల్లో నగదు జమ చేసినట్లు అధికారులు వివరించారు. మిగిలిన 257 కుటుంబాలకు బాచారం వద్ద ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూములతో కూడిన పునరావాస ప్యాకేజీని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఏటూరునాగారం అభయారణ్యంలో రెండు రహదారి ప్రాజెక్టులకు కమిటీ సిఫార్సు చేసింది. నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలోని డిండి బాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి అటవీ భూమి వినియోగానికి అనుమతినిచ్చారు. కవాల్ టైగర్ రిజర్వ్, ప్రాణహిత అభయారణ్యం పరిధిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించారు. 

దేశంలోనే మేటిగా హైదరాబాద్ ​జూ పార్కు:  మంత్రి సురేఖ

హైదరాబాద్ జూ పార్కును దేశంలోనే మేటిగా తీర్చిదిద్దుతామని మంత్రి సురేఖ పేర్కొన్నారు. వరంగల్ జూను అప్‌గ్రేడ్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నెహ్రూ జూ పార్కును మంత్రి సందర్శించి పక్షులు, కోతుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్లు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడ్​లో ఏర్పాటు చేసిన ‘విహార్‌ ఫుడ్‌ కోర్ట్‌’ను ప్రారంభించారు. సందర్శకుల కోసం ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సౌకర్యార్థం ప్రత్యేక క్యూఆర్‌ యాప్‌ను, హెల్త్‌ క్యాంపును ఆమె ఆవిష్కరించారు.

©️ VIL Media Pvt Ltd.